ఏప్రిల్‌లో ఏపీ సహకార సంఘాల ఎన్నికలు!
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు(సింగిల్ విండోలకు) ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. 2013 జనవరి, ఫిబ్రవరి నెలల్లో సింగిల్‌విండోలకు ఎన్నికలు జరిగాయి.
వారి పదవీకాలం 2018 ఫిబ్రవరిలో పూర్తయింది. అప్పటి నుంచి 2019 జూలై తరువాత పర్సన్ ఇన్‌చార్జి కమిటీలు కొనసాగాయి. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో సింగిల్‌విండోలకు అధికారులను పర్సన్ ఇన్‌చార్జిలను నియమించారు.
సహకార ఎన్నికల ప్రక్రియకు సుమారు 45 రోజులు వ్యవధి కావాల్సి వస్తుంది. సంఘాల్లో సభ్యుల వారీగా తొమ్మిది అంశాలతో కూడిన వివరాలను సహకార శాఖ అధికారులు సేకరిస్తున్నారు. విండోల్లో రూ.300 షేర్ ధనం కలిగినవారే ఓటు హక్కు కలిగి ఉంటారు.
రెవెన్యూ గ్రామాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల్లో పురుషులు, స్ర్తీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో జాబితా తయారు చేసి సహకార శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపనున్నారు.