శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (09:56 IST)

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ కౌన్సెలింగ్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ శుక్రవారం నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. తొలి విడత జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నల్లపాడులోని ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, నరసరావుపేటలోని జేఎన్‌టీయూ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ, మాజీ సైనికుల పిల్లల కోసం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రత్యేకంగా సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. శుక్రవారం సర్టిఫికెట్లు పరిశీలించే ర్యాంకులివే... 
 
* ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉదయం 9 గంటలకు ఒకటి నుంచి 5000 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 5001 నుంచి 10,000 ర్యాంకు వరకు సర్టిఫికెట్లు పరిశీలన జరుగుతుంది.
 
* నల్లపాడులోని ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉదయం 9 గంటలకు 10,001 నుంచి 15,000 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి  15,001 నుంచి 20,000 ర్యాంకు వరకు సర్టిఫికెట్లు పరిశీలన చేస్తారు.
 
* నరసరావుపేటలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 9 గంటకు 1 నుంచి 10 వేల ర్యాంకు వరకు, మధ్యాహ్నం 1 గంట ఉంచి 10,001 నుంచి 20 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. 
 
విద్యార్థులు తీసుకురావాల్సిన పత్రాలివే... 
సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే విద్యార్థులు అన్ని ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్‌ కాపీలను రెండు సెట్లు తీసుకురావాలి. విద్యార్థి ఎంసెట్‌ ర్యాంకు కార్డు, హాల్‌ టికెట్‌, ఇంటర్‌ మార్కుల జాబితా, పుట్టిన తేదీ సర్టిఫికెట్‌(పదో తరగతి సర్టిఫికెట్‌), టీసీ, ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, సంబంధిత కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి. 
 
తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేదా తెల్లరేషన్‌ కార్డు ఉంటే అందులో తల్లిదండ్రుల పేర్లతో పాటు విద్యార్థి పేరు ఉండాలి. దీనితోపాటు నేటివిటీ సర్టిఫికెట్‌తో పాటు ఆయా కేటగిరీ విద్యార్థుల వివరాలకు అనుగుణంగా మొత్తం 13 రకాల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి. విద్యార్థులకు సందేహాలు ఉంటే 8106876345, 8106575234, 7995865456, 7995681678 అనే హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.