సకాలంలో అన్ని పాఠశాలలకు జగనన్న విద్యాకానుక కిట్లు : మంత్రి సురేష్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాకానుక విద్యార్థులకు సకాలంలో అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలోని మంత్రి ఛాంబరులో ఈ అంశంపై అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య (4,26,469) కారణంగా అదనపు కిట్ల అవసరంపై తీసుకుంటున్న చర్యలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. పుస్తకాలు, షూలు, సాక్స్‌లు, బెల్ట్, బ్యాగ్, యూనిఫామ్‌ల నాణ్యత, సరఫరాపై సమగ్రంగా పూర్తి స్థాయిలో సమీక్షించారు.
పాఠశాలలు ప్రారంభించే సమయానికి అన్ని పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక కిట్లు చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి 15 రోజులకొకసారి సమీక్షిస్తానని నిర్లక్ష్యం లేకుండా అధికారులు నిర్దేశించిన సమయానికి విద్యాకానుక కిట్లు పాఠశాలలకు చేర్చాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశం లో పాఠశాల విద్యా డైరెక్టర్ చిన్న వీరభద్రుడు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు.