గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:25 IST)

ఏప్రిల్ ఫస్ట్ నుంచి రెండో విడత నాడు-నేడు పనులు: మంత్రి ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలో ఉన్న 15,700 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ‘మన బడి – నాడు నేడు’ కింద చేపట్టిన మొదటి విడత పనులు వచ్చే నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నేటి వరకూ రూ.2,570 కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేశామన్నారు. ఫ్యాన్లు, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు తదితర కొనుగోలులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.245 కోట్ల మేర ఆదా చేశామన్నారు.

ఏప్రిల్ ఒకటో తేదీనుంచి రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 15,700 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మన బడి – నాడు నేడు’ పథకాన్ని ప్రారంభించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందన్నారు. 45 వేల పాఠశాలల్లో 10 అంశాల్లో మూడు విడతలుగా నాడు-నేడు పనులు చేపట్టామన్నారు. ముందుగా 15,700 పాఠశాలల్లో 3,669 కోట్ల మొదటి విడత నాడు-నేడు పనులకు ప్రారంభించామన్నారు. గతేడాది జూన్ లో ఈ పనులు ప్రారంభించామని, గడిచిన 7 నెలల కాలంలో రూ.2,570 కోట్లు వెచ్చించామని తెలిపారు.

పారిశుద్ధ్య పనులు 100 శాతం పూర్త చేశామని, సీలింగ్ ఫ్యాన్లు 100 శాతం అమర్చామని తెలిపారు. అల్మరాలు 66 శాతం, గ్రీన్ బోర్డులు 89 శాతం, పెయింటింగ్ పనులు 46 శాతం, తాగునీటి కల్పన పనులు 39 శాతం పూర్తయ్యాయన్నారు. స్మార్టు టీవీలను 50 శాతం మేర అమర్చామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యం మేరకు మిగిలిన పనులను మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రూ.245 కోట్లు ఆదా...
కాంట్రాక్టర్లతో కాకుండా సోషల్ కాంట్రాక్టు ద్వారా పాఠశాలల పేరంట్స్ కమిటీలతో ఫర్నీచర్, ఫ్యాన్లు, గ్రీన్ బోర్డులు, విద్యుత్, తాగేనీరు సౌకర్యాలు తదితర మౌలిక వసతుల కల్పనకు నిధులు ఖర్చు చేయించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలన్న లక్ష్యంతో పారదర్శకతతో ఫ్యాన్లు, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు వంటి వస్తువులు కొనుగోలు చేశామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా చేసిన కొనుగోలు వల్ల రూ.245 కోట్లు ఆదా చేశామని మంత్రి తెలిపారు. 

ఏప్రిల్ ఫస్ట్ నుంచి రెండో విడత ‘నాడు-నేడు’
ఈ ఏడాది ఏప్రిల్ మొదటి తేదీ నుంచి ‘మన బడి – నాడు నేడు’ పనులు చేపట్టనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పేపర్ వర్కు పూర్తయ్యిందన్నారు. ఏప్రిల్ లో ప్రారంభమయ్యే రెండో విడత నాడు-నేడు పనులు నవంబర్ నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 10, 15 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

గత ప్రభుత్వాలు కేవలం కేంద్రమిచ్చే నిధులతోనే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేవన్నారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇందుకోసం వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తోందన్నారు. పాఠశాలల్లో ఫ్లోరింగ్ కోసం టైల్స్ వాడుతున్నామన్నారు. కొన్ని పాఠశాలల్లో గ్రానైట్ కూడా వాడారన్నారు. 
 
దేశానికే ఆదర్శనం ‘నాడు – నేడు’...
నాడు-నేడు పనులకు సంబంధించిన అన్ని విషయాలు తమ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఏ నిమిషంలో ఎంత ఖర్చు పెడుతున్నామో చూసుకోవొచ్చునన్నారు. రాష్ట్రంలో చేపట్టిన మన బడి -  నాడు నేడు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏపీలో అమలవుతున్న నాడు – నేడు పనులను త్వరలో స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ఇటీవల ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

డిగ్రీ కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు...
గతేడాది కంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 1336 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెట్ డిగ్రీ కళాశాలలో గతేడాది కంటే 40 వేల మందికి పైగా విద్యార్థులు అదనంగా అడ్మిషన్లు పొందారన్నారు. ఈ ఏడాది 2.60 లక్షల మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారన్నారు. ఈ ఏడాది ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించామన్నారు.