1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (08:44 IST)

ఏపీలో నేటి నుండి రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

ఈ నెల 3వ తేదీ నుండి రాష్ట్రంలో రెండవ విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యం)ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ను సమర్ధవంతంగా నియంత్రించగలిగామని సోమవారం రాష్ట్రంలో 69 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని తెలిపారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి మంత్రి మాట్లాడుతూ బుధ‌వారం నుండి రాష్ట్రంలో రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నిప్రారంభించడం జరుగుతుందని వివరించారు. ఈ విడతలో పంచాయితీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల సిబ్బందితోపాటు పారిశుద్య సిబ్బంది అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే కోవిన్ యాప్‌లో 5లక్షల 90వేల మంది పేర్లు రిజిష్టర్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు గాను 3వేల 181 సెషన్ సైట్లను సిద్దం చేస్తున్నట్టు వివరించారు. 

మొదటి దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 88వేల 307 మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకూ లక్షా 89వేల 890 మందికి వ్యాక్సిన్లు అందించి 48.90శాతం లక్ష్యం సాధించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి శ్రీనివాస్ వెల్లడించారు.

వ్యాక్సిన్లు తీసుకోవడంలో డాక్టర్లు,ఇతర వైద్య సిబ్బందిలో కొన్ని సందేహాలు ఉన్నాయని అందుకే వ్యాక్సిన్లు వేయడంలో కొంత జ్యాప్యం నెలకొందని పేర్కొన్నారు.కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత తలెత్తున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కేసు వారీ అవసరమైన చర్యలు తీసుకుంటోందని వివరించారు.

ఇటీవల వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం చనిపోయిన ఆశా వర్కర్ కుటుంబానికి మంగళవారం 50 లక్షల రూ.లు పరిహారం అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఆమె మరణానికి సంబంధించి  పూర్తి స్థాయి పోస్టుమార్టం నివేదిక వైద్య ఆరోగ్యశాఖకు అందాల్సి ఉందని చెప్పారు.

అలాగే వ్యాక్సిన్ తీసుకున్నఅనంతరం అనారోగ్యానికి గురైన ఒంగోలు ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డా. ధనలక్ష్మికి ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందించేందుకు ఆమెను చెన్నె అపోలో ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి వివరించారు.

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ రెండవ విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 89వేల 100 మంది పోలీస్ సిబ్బంది,లక్షా 55వేల మంది మున్సిపల్,3లక్షల 32వేల మంది రెవెన్యూ సిబ్బంది పేర్లు కోవిన్ యాప్‌లో రిజిష్టర్ చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16లక్షల 31వేల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.