ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (14:37 IST)

సీఎం జగన్ మెచ్చిన మహిళా నేతకు గూడు లేదు... ఎందుకని?

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మెచ్చిన మహిళా నేతల్లో తోటకూర మారెమ్మ ఒకరు. తూర్పుగోదావరిజిల్లా ఉప్పాడ వాసి. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఇటీవలే నియమితులైంది. కానీ, నివర్ తుఫాను ధాటికి ఆమె ఉన్న ఒక్క ఇల్లూ కోల్పోయింది. ఫలితంగా ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆర్టీసీ బస్టాండులో తలదాచుకుంటోంది. 
 
రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న మారెమ్మకు వచ్చిన కష్టమేంటో ఓసారి తెలుసుకుందాం. ఉప్పాడకు చెందిన తోటకూర మారెమ్మ ఇటీవలే ఏపీ మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితులయ్యారు. ఆమె మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కూడా. 
 
అయితే, ఇటీవల రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన నివర్ తుఫాను మారెమ్మ ఇల్లు సముద్రంలో కలిసిపోయింది. ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రపు అలలు మారెమ్మ ఇంటిని కబళించాయి. దాంతో ఆమె తన సామానును ఇతరుల ఇళ్లలో ఉంచి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ బస్ షెల్టరులో ఉంటోంది. 
 
ఈమెకు నలుగురు కుమార్తెలు. అయితే, వివిధ కారణాల కారణంగా ఇద్దరు కుమార్తెలు ఆమెవద్దే ఉంటున్నారు. ఇపుడు ఈ ముగ్గురు కలిసి బస్ షెల్టరులో తలదాచుకుంటూ, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
 
జిల్లాలోనే కాకుండా స్థానికంగాకూడా ఎంతో బడా వైకాపా నేతలు ఉన్నప్పటికీ ఆమె గోడును పట్టించుకున్న నాథుడు లేడు. దీనిపై మారెమ్మ మాట్లాడుతూ, తానంటే సీఎం జగన్ ఎంతో అభిమానం చూపిస్తారని, వైసీపీ ఏర్పడినప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించానని వెల్లడించింది. 
 
ఇప్పుడు పేరుకు రాష్ట్రస్థాయి పదవిలో ఉన్నప్పటికీ, రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. సాయం చేయాలంటూ పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని మారెమ్మ వెల్లడించింది. బిడ్డ లాంటి సీఎం జగనే తనను ఆదుకోవాలని ఆ మత్స్యకార మహిళ కోరుతోంది.
 
కాగా, మత్స్యకార వర్గంలో ఎంతోమంది ప్రముఖ నేతలు ఉన్నప్పటికీ, సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏరికోరి మారెమ్మను స్వయంగా పిలిచి మరీ డైరెక్టరు కుర్చీలో కూర్చోబెట్టారు. అలా జగన్ మెచ్చిన నేత కూడా గుర్తింపు పొందారు. కానీ, ఇపుడుఇల్లు కూడా లేక రోడ్డునపడడం కలచివేస్తోంది.