మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (09:01 IST)

'అమరావతి' పేరు వినిపించకుండా చేయడమే లక్ష్యమా? పేరు మార్పు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఏమాత్రం గిట్టనట్టు, రుచించినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. ఆ తర్వాత రాజధాని కోసం ఆ ప్రాంతానికి రైతులు ఏకంగా 33 వేల ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. 
 
కానీ, రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధానిని మూడు ముక్కలు చేయాలని భావించారు. అందులో ఓ భాగం విశాఖపట్ణం మరో భాగం అమరావతి, మూడో ముక్కను కర్నూలుకు తరలించాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం సీఎం కుర్చీలో కూర్చొన్నప్పటి నుంచి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ, కోర్టులు కలిగిస్తున్న ఆటంకాల వల్ల ఆయన ఆటలు సాగడం లేదు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసమే పేరు మార్చినట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.
 
విశాఖపట్టణంలో తలపెట్టిన మెట్రోకు కూడా అమరావతి పేరే ఉండటంతో ప్రాజెక్టు పేరును మార్చినట్టు వివరించింది. గతంలో నాగ్‌పూర్ మెట్రో ప్రాజెక్టు పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్టు లిమిటెడ్‌గా మార్చినట్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. అలాగే, లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్చారని ఆ జీవోలో విరించారు.