1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 15 నవంబరు 2021 (11:03 IST)

గుట్కా, పాన్ మ‌సాలా నిషేధానికి ఏపీ ప్ర‌భుత్వం కసరత్తులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఇప్పటికే మందు బాబులకు పెద్ద షాక్ ఇచ్చిన ప్రభుత్వం,  దశలవారీగా మద్య నిషేధం కార్యక్రమం అమలులో భాగంగా అనేక రకాల ఆంక్షలను విధించింది. మ‌ద్యం రేట్లను కూడా రెట్టింపు చేసింది. 
 
 
ఇక తాజాగా గుట్కా, పాన్ మసాలా, జర్దాలను నిషేధించాలని నిర్ణయించింది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఈ పదార్థాల తయారీ, విక్రయాల నిషేధించనుంది. దీనిపై ప్రత్యేకంగా ఓ చట్టాన్నితీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును జగన్ సర్కార్ ఇప్పటికే రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీ నుంచి ఆరంభం అయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు.
 
 
గుట్కా, పాన్ మసాలా, జర్దా వంటి హానికారక పదార్థాలను దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఇప్ప‌టికే నిషేధించాయి. పశ్చిమ బెంగాల్, హర్యానా ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏడాదికాలం పాటు వాటిని బ్యాన్ చేసింది. ఉత్తరాఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లల్లో వాటి తయారీ, అమ్మకాలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. తాజాగా జగన్ సర్కార్ కూడా అదే బాటలో సాగనుంది. గుట్కా, పాన్ మసాలా వంటి పదార్థాల తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. వాటికి భారీ డిమాండ్ ఉంటోంది.
 
 
బడాబాబుల నుంచి దినసరి వేతన కార్మికులు సైతం వాటిని వాడుతుంటారు. ఈ పాన్ మసాలా, గుట్కా నమలడం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినప్పటికీ.. దాన్ని మానుకోలేని వారు కోట్లల్లో ఉన్నారు.వయోధిక వృద్ధులు సైతం దీన్ని వినియోగిస్తోన్నారు. పాన్ మసాలా, గుట్కా, జర్దాను నమలడానికి పూర్తిస్థాయిలో అలవాటు పడి, దాన్ని మానుకోలేకపోతోన్న వారి సంఖ్య భారీగా ఉంటోంది. నోటి కేన్సర్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య సైతం రాష్ట్రంలో పెరుగుతోంది.

 
ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్.. వాటి తయారీ, విక్రయాలపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందిస్తోంది. ఈ బిల్లు రూపకల్పన తుదిదశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కావడం వల్ల ఏకగ్రీవంగా ఈ బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
 
గుట్కా, పాన్ మసాలా అమ్మకాలను అడ్డుకునే అధికారాన్ని ప్రభుత్వం పోలీసులకు అప్పగించేలా ఈ బిల్లును రూపొందించింది. ఇదివరకు ఈ అధికారం తూనికల, కొలతల శాఖ, ఆహార భద్రతా విభాగం అధికారుల చేతుల్లో ఉండేది. దీన్ని పోలీసులకు అప్పగించడం వల్ల నిషేధం విజయవంతమౌతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు చట్ట రూపాన్ని దాల్చితే.. వాటిని తయారు చేసినా, విక్రయించినా.. కేసులను పెట్టే అధికారం పోలీసులకు ఉంటుంది. వాటి విక్రేతలపై ఏడాది జైలుశిక్షతో పాటు లక్ష నుంచి అయిదు లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా చట్టం ఉంటుందని తెలుస్తోంది.