బయోమెట్రిక్ పేరుతో జీతాలు కట్... ఖంగుతిన్న ఆరోగ్య సిబ్బంది
కరోనా కష్ట సమయంలో ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. ఇప్పటికీ వ్యాక్సినేషన్ పేరుతో పండుగలు, సెలవు దినాల్లో కూడా విధులు నిర్వహిస్తున్నారు. వారి కర్తవ్య దీక్షకు ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటూ వేనోళ్ళ పొగిడారు. ఏపీ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సైతం ఈ శాఖ 24/7 అంటూ సచివాలయ ఏఎన్ఎంలను తీవ్ర పని ఒత్తిడికి గురి చేశారు. అయినా తమకిచ్చిన టార్గెట్ ను పూర్తి చేయడానికి ఏఎన్ఎంలు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేస్తున్నారు. అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది.
బయోమెట్రిక్ పేరుతో అక్టోబర్ నెల జీతాల్లో కోత విధించింది. దీంతో ఆరోగ్య సిబ్బంది తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు. కుటుంబాలను పట్టించుకోకుండా, పండుగలు, ప్రభుత్వ సెలవులను పట్టించుకోకుండా నిరంతరం విధులు నిర్వహిస్తున్న తమకు బయోమెట్రిక్ పేరుతో జీతాల్లో కోత విధించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. వచ్చే రూ.15 వేలతో నిరంతరం విధులు నిర్వహిస్తున్న తమకు బయోమెట్రిక్ పేరుతో జీతాల్లో కోత విధిస్తే తామెలా విధులు నిర్వహించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తట్టుకుని తామెలా కుటుంబాలను పోషించుకోవాలని ఆవేదనకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 24 గంటలూ విధులు నిర్వహిస్తున్న తమకు బయోమెట్రిక్ తొలగించి పూర్తి జీతాలు వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు.