మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 4 జూన్ 2020 (20:04 IST)

పర్యావరణ పరిరక్షణ బాధ్యత మనందరిదీ: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్

నిరంతరం మొక్కలను పెంచటం, నీటి వనరులను పరిరక్షించటం, కాలుష్యాన్ని నివారించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చేయీచేయీ కలపాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన పెంపొందించుకునే క్రమంలో ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవటం అనవాయితీ కాగా ఈ క్రమంలో గౌరవ గవర్నర్ సందేశం ఇచ్చారు.
 
ప్రతి సంవత్సరం విభిన్న ఇతివృత్తాలతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా "జీవవైవిధ్యం జరుపుకుందాం" పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తదనుగుణంగా పర్యావరణ పరిరక్షణ కోసం కంకణబద్దులు కావాలని బిశ్వభూషణ్ ఆకాంక్షించారు.
 
నీటి సంరక్షణ, చెట్ల పెంపకం, కాలుష్య కారకాల నివారణ ద్వారా ప్రకృతిని జాగ్రత్తగా పరిరక్షించుకోవటం ఎంతో అవసరమన్న దానిని మానవాళి గ్రహించాల్సిన అవసరం ఉందని, మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అన్నీ ప్రకృతి సమకూర్చిన బహుమతులేనని రాష్ట్ర గవర్నర్ వివరించారు.
 
పర్యావరణ అసమతుల్యత నుండి పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో భారీ ఎత్తున చెట్ల పెంపకాన్ని చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే పిలుపునిచ్చారని బిశ్వ భూషణ్ గుర్తు చేసారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.