సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 20 మే 2020 (19:16 IST)

కరోనా వైరస్‌తో ఆందోళన వద్దు, అలా చేద్దాం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రేడియో సందేశం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రజలనుద్దేశించి రేడియో సందేశమిచ్చారు. “మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం మార్చి నుండి మన దేశం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. ఎటువంటి మినహాయింపు లేకుండా అనేక దేశాలలో వ్యాపించిన మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రభావితమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి వలన కలిగే నష్టం యొక్క ప్రభావం అనేక రంగాలలో కనిపిస్తుంది. 
 
పరిశ్రమలు ఉత్పత్తిని నిలిపివేసాయి, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రపంచ జనాభా విపత్తు యొక్క సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్‌ను కనుగొనే పరిశోధన చాలా దేశాలలో జరుగుతున్నప్పటికీ, టీకా కనుగొనబడటానికి కొంత సమయం పడుతుంది. సమీప భవిష్యత్తులో పూర్వపు సాధారణ స్థితిని పునరుద్ధరించుకోలేక పోయినా, పరిశ్రమలు, ఇతర రంగాలు నెమ్మదిగా తమ కార్యకలాపాలను ప్రారంభించడం తప్పనిసరి. 
 
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా వైరస్ కట్టడికి అవసరమైన వ్యాక్సిన్ కనుగొనబడే వరకు మన జీవన క్రమానికి అవసరమైన సాధారణ కార్యకలాపాలను కొనసాగించడం కోసం శారీరక దూరాన్ని సక్రమంగా నిర్వహించడం, ముఖ ముసుగులు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ఇతర రక్షణలను అనుసరించడం చేయవలసి ఉంది.
 
కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు నిర్దేశించిన 4.0 లాక్ డౌన్ ముగిసే మే 31 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తమ నివాసాలకే పరిమితం కావాలని నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారిని ఎట్టి పరిస్ధితులలో ఇళ్ళ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించకూడదు. శారీరక దూరాన్ని పాటిస్తూ, ముఖ ముసుగులు ధరించి, చేతులు కడుక్కోవడం వంటి చర్యలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే నివాసగృహాలలో జరిగే కార్యక్రమాలను సైతం నిర్వహించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 
 
కరోనా వ్యాప్తిని విజయవంతంగా నివారించడంలో కీలకం, అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించడమే. కరోనా వైరస్‌తో సంబంధం ఉన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే కాల్‌సెంటర్‌లో వైద్య నిపుణులను సంప్రదించండి, సొంతంగా మందులు వాడకండి. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. 
మరోవైపు వలస కార్మికులను శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా తమ స్వదేశాలకు పంపే ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక ఆశ్రయం, ఆహారం కోసం ఏర్పాట్లు చేశాయి. ‘పిఎం కేర్స్-ఫండ్’ మరియు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఉదారంగా విరాళాలు అందించండి. ఈ నిధులు విపత్తు వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రజలకు ఉపశమనం, పునరావాసం కల్పించడానికి ఉపయోగించబడతాయి.
 
కరోనా వైరస్ రావడం వల్ల నష్టపోతున్న మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పలు సహాయక చర్యలను ప్రకటించారు. ఎంఎస్‌ఎంఇలు (మధ్యస్థ, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు), వ్యవసాయం ఇతర రంగాలకు ప్రయోజనకరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం రూ .20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. దానిని సద్వినియోగ పరుచుకుని దేశాభివృద్దికి బాటలు వేయండి.
 
వివిధ విద్యాసంస్థలు నిర్వహించే ఆన్‌లైన్ తరగతులను డిజిటల్ మోడ్ ద్వారా ఉపయోగించుకోవాలని నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే విద్యాసంస్థల ప్రారంభం మరింత ఆలస్యం కావచ్చు. దేశంలోని బాధ్యతాయుతమైన పౌరులుగా, మన కర్తవ్యాలన్నింటినీ నెరవేర్చడం ద్వారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఈ ప్రపంచ సంక్షోభాన్ని అధిగమించడానికి మనం కృషి చేయవలసిన సమయం ఆసన్నమైంది. 
 
ఆరోగ్య రంగ నిపుణులు, నర్సులు, పారా మెడికల్ , పారిశుద్ధ్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులు  వంటి ముందు వరుస  యోధులు ప్రజలను రక్షించడం, కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడం కోసం గొప్ప సేవలను అందిస్తున్నారు. వారికి సహకారం అందించటం ద్వారా మనమందరం మద్దతు ఇవ్వాలి.
 
ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వంటి యువసంస్థలు, స్వచ్ఛంద సంస్థలైన రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌జిఓలు, పౌర సమాజ సభ్యులు  తమ అవగాహాన కార్యక్రమాలు కొనసాగించాలి, ఇంటి లోపల ఉండడం, శారీరక దూరం కొనసాగించడం బహిరంగ ప్రదేశాలలో ముఖముసుగులు ధరించడం వంటి వాటి పట్ల నిరంతర అవగాహన కల్పించాలని నేను వారిని అభ్యర్థిస్తున్నాను. 
నిరుపేదలు, కర్షకులు, కార్మికులు, వలస కార్మికులు ఈ క్లిష్ట సమయాల్లో ఎక్కువగా ప్రభావితమవుతారు. ముఖ ముసుగులు, చేతి శానిటైజర్లు, ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు వంటి అవసరమైన వస్తువులను వారికి పంపిణీ చేయాలని రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులకు సూచించాను.
 
అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు చేయించుకుని, అవసరమైన వారు నిర్బంధ రక్షణ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని నేను ప్రజలను అభ్యర్థిస్తున్నాను. పొడి దగ్గు, అధిక జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న ఎవరైనా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి, తదుపరి చర్యలపై వైద్య సలహా తీసుకోవాలి. కరోనా వైరస్ దగ్గు, తుమ్ము, వ్యక్తిగత పరిచయం, కలుషితమైన వస్తువుల సామూహిక సేకరణ ద్వారా వ్యాపిస్తుంది. 
 
కరోనా వైరస్ వల్ల నెలకొన్న పరిస్థితులతో సహజీవనం చేయడం తప్ప ప్రస్తుతానికి వేరే ప్రత్యామ్నాయం లేదని గుర్తుంచుకోవాలి. అయితే అనవసరమైన ప్రయాణాలను నివారించడం, శారీరక దూరాన్ని పాటించటం, బహిరంగ ప్రదేశాలలో ముఖ ముసుగును ధరించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో తరచుగా చేతులు కడుక్కోవడం వంటి చర్యల వల్ల కరోనాను నివారించటం సాధ్యమే కాబట్టి వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన పోరాటం కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా మాత్రమే, దీనివల్ల ప్రభావితమైన వ్యక్తులతో కాదని గుర్తుంచుకోవాలి- జై హింద్"