సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 మే 2020 (14:54 IST)

రేషన్ కార్డు లేకపోయినా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిందే : హైకోర్టు

తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. లాక్డౌన్ సమయంలో రేషన్ కార్డు ఉన్న వినియోగదారులకు ఉచితంగా బియ్యంతో పాటు.. ఇతర సరకులను పంపిణీ చేస్తున్నారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా.. ప్రతి ఒక్కరికీ ఉచితంగా రేషన్ సరకులు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, బయోమెట్రిక్‌తో పని లేకుండా అందజేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. 
 
లాక్డౌన్ సమయంలో కేవలం రేషన్ కార్డు ఉన్నా వారికి మాత్రమే ప్రభుత్వం వివిధ రకాల రేషన్ సరుకులు, నగదును పంపిణీ చేస్తోంది. దీంతో రేషన్ కార్డు లేని పేదలు అనేక మంది ఉన్నారనీ, వారందరికీ కూడా ఉచితంగా రేషన్ సరకులు పంపిణీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు పై విధంగా ఆదేశించింది. అంతేకాకుండా ఎలాంటి సమాచారం లేకుండా 8 లక్షల రేషన్ కార్డులు ఎలా రద్దు చేస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. అందువల్ల వలస కూలీలతో పాటు పేదలకు ఉచితంగా రేషన్ సరకులు, రూ.1500 నగద ఇవ్వాలని ఆదేశించింది.