శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 మే 2022 (08:20 IST)

నో ఫోన్ జోన్లుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు - ఏపీ సర్కారు ఆదేశాలు

exams
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రోజూ ప్రశ్నపత్రం లీక్ అవుతోంది. పరీక్ష ప్రారంభమైన కొన్న నిమిషాల్లోనే వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుంది. పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్లు, ఎగ్జామినర్లే ఈ ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు. దీంతో ప్రశ్నపత్రం లీక్ కాకుండా, విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా వంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
పదో తరగతి పరీక్ష జరిగే పరీక్షా కేంద్రాల్లోకి ఇక నుంచి ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీచేసింది. చివరకు పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్లు కూడా పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు తీసుకురాకూడదని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 
 
పరీక్షా కేంద్రాల్లో ఫోన్లతో పాటు ఐప్యాడ్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కనిపించినా వాటిని స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రశ్నపత్రంపై విద్యార్థిని హాల్ టిక్కెట్ నంబరు, పరీక్షా కేంద్రం నంబరు కూడా విధిగా వేసేలా చూడాలని ఇన్విజిలేటర్లను ఆదేశించింది.