సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 27 డిశెంబరు 2016 (20:22 IST)

నోట్ల రద్దు తర్వాత క్యాష్‌లెస్‌గా ఉపాధి హామీ కూలీ వేతనాలు

నోట్ల రద్దు తర్వాత... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి నగదు కొరత లేకుండా ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచుతోంది. దేశంలో నగదు కొరతతో పలు రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ... రాష్

నోట్ల రద్దు తర్వాత... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి నగదు కొరత లేకుండా ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచుతోంది. దేశంలో నగదు కొరతతో పలు రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ... రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన చర్యలు మూలంగా వీలైనంత వరకు ప్రజలకు నగదు అందేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంది. మరీ ముఖ్యంగా పింఛన్‌దారులుకు, ఉపాధి కూలీలకు సత్వరమే నగదు అందేలా ప్రభుత్వం వ్యవహరింస్తోంది.
 
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశంలో వెయ్యి, ఐదువందల నోట్ల రూపాయల రద్దు నిర్ణయం తర్వాత ఉపాధి హామీ కూలీలకు కూలీ చెల్లింపు విషయంలో ఎక్కువ సమస్యలు తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖ విభాగం డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సఫర్ (డీబీటీ) నిర్వర్తిస్తోంది. ఉపాధి హామీ కూలీలకు ఇప్పటివరకు బ్యాంక్ మిత్రల ద్వారా నగదు అందజేస్తున్న ప్రభుత్వం ఇకపై వారికి కూడా క్యాష్ లెస్ ట్రాన్సక్షన్ల దిశగా అడుగులు వేయిస్తోంది. 
 
రాష్ట్రంలో 80 లక్షలకు పైగా క్రియాశీల ఉపాధి హామీ కూలీలు
ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు బ్యాంక్ ఎకౌంట్లను అందించే ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం... త్వరలోనే కూలీలందరికీ బ్యాంక్ ఎకౌంట్లను అందజేసేందుకు సిద్ధమైంది. మొత్తం 80 లక్షల 52 వేల 663 మంది క్రియాశీల ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వీరిలో 50,64,302 మందికి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఎకౌంట్లు ఉన్నాయి. వారి ఎకౌంట్లను ఆధార్ పేమేంట్ బ్రిడ్జి సిస్టమ్ (ఏపీబీఎస్) తో అనుసంధానం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలందరి ఆధార్ కార్డు నెంబర్లను  నేషనల్ పేమేంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) వద్ద అనుసంధానం చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. ఇకపై వారి వారి బ్యాంకుల్లో ఉపాధి హామీ కూలీని జమ చేసేందుకు వారి దగ్గర్నుంచి అనుమతి పత్రాన్ని సైతం అధికారులు తీసుకున్నారు. 
 
ఉపాధి హామీ కూలీలందరికీ జన్‌ధన్ యోజన కార్డులు
ఉపాధి హామీ కూలీలందరికి జన్ ధన్ యోజన ఖాతాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీల్లో కొంత మందికి బ్యాంక్ ఎకౌంట్లు లేని విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే బ్యాంక్ ఎకౌంట్ల నెంబర్లను వారి ఆధార్ నెంబర్ తో అనుసంధానిస్తారు. ఇలా చేయడం ద్వారా వారి ఎకౌంట్ల వివరాలు గ్రామీణాభివృద్ధి శాఖ వద్ద అప్టేట్ అవుతాయి. ఉపాధి కూలీలకు అందించిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఎకౌంట్ల వివరాలను నేషనల్ పేమేంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ)తో అనుసంధానిస్తారు.
 
జన్ ధన్ యోజన ఎకౌంట్ తీసుకున్నవారందరికీ రూపే కార్డులు
ఇప్పటి వరకు బ్యాంక్ ఎకౌంట్లు ఉన్న చాలా మందికి రూపే కార్డుల లేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల్లో మొత్తం 80 లక్షల 52 వేల 663 క్రియాశీల కూలీలు ఉండగా వారిలో 50,64,302 బ్యాంక్ ఎకౌంట్లు ఉన్నాయి. వీరిలో సగం మందికి మాత్రమే అంటే 27 లక్షల 73 వేల మందికి మాత్రమే రూపే కార్డులను అందించడం జరిగింది. వారు కూడా పెద్దగా వాటిని ఉపయోగిస్తున్న పరిస్థితి లేదు. వీరందరినీ బ్యాంకులకు వెళ్లేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారు చేసే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా నగదు రహితంగా మార్చాలని గ్రామీణాభివృద్ధి శాఖ భావిస్తోంది. 
 
రాష్ట్రంలోని 13,100 గ్రామాల్లో బ్యాంక్ మిత్రాలు  
రాష్ట్రంలోని 13,100 గ్రామాల పరిధిలో స్టేట్ బ్యాంక్ మిత్రాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 52.52 లక్షల మంది ఉపాధి కూలీలను అకౌంట్లను ఆధార్ పేమేంట్ బ్రిడ్జి సిస్టమ్ ద్వారా అనుసంధానించారు. ఈ ఏడాది చివరకు రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలందరికి ఆధార్ పేమేంట్ బ్రిడ్జితో అనుసంధానించేలా గ్రామీణాభివృద్ధి శాఖలోని డీబీటీ ప్రాజెక్టు విభాగం కృషి చేస్తోంది.  
రోజు వారీ లావాదేవీలను పరిశీలించనున్న గ్రామీణాభివృద్ధి శాఖ 
 
నిత్యం ఉపాధి హామీ కూలీలకు సంబంధించి చెల్లిస్తున్న చెల్లింపులు, పనులను విజయవాడ కేంద్రంగా ఉన్న డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సఫర్ నిర్వాహకులు పరిశీలిస్తారు. అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకోవడంతోపాటు, కార్యక్రమ నిర్వహణకు సంబంధించి వారితో టెలికాన్ఫరెన్సులోనూ చర్చిస్తారు. నివేదికల ఆధారంగా ఉన్న సమస్యలను వీలైనంత వరకు వారు కృషి చేస్తారు. 
ఈ సారి పక్కాగా పింఛన్ల చెల్లింపు 
 
మరోవైపు గత నెలలో నోట్లు రద్దు నేపథ్యంలో...   నగదు కొరత ఏర్పడటంతో ఎదురైన ఇబ్బందులేవీ జనవరిలో ఇచ్చే పింఛన్ల పంపిణీ విషయంలో జరక్కుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బ్యాంకులు ఇందుకు సహకరించేలా ఇప్పటికే అన్ని చర్యలు పూర్తి చేశారు. పింఛన్ సొమ్మును చెల్లింపుకు అవసరమైన మేరకు చిన్న మొత్తాల నోట్లను అందించేందుకు బ్యాంకర్లు సైతం అంగీకరించారు.