ఏపీలో ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
వైద్యా ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
డీఎంఈ, వైద్య విధాన పరిషత్, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో 5,701 పోస్టులు, అలాగే 804 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది.
మరో 2,186 స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు వివిధ కేటగిరీలలో 1,021 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి విద్యా, వైద్యం, ఆరోగ్యం రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి వంటి పరిణామాలు చోటుచేకున్నాయి.
దీంతో ఆయాశాఖా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశాలు జారీచేశారు. వీలైనంత త్వరగా ఖాళీలను గుర్తించి.. నోటిఫికేషన్ విడుదల చేయాలని గత సమీక్షా సమావేశంలో సూచించారు.
సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన వైద్యారోగ్యశాఖ ఖాళీలను గుర్తించి వాటికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా క్లిష్ట సమయంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.