శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (17:08 IST)

ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా.. కానీ...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఆ రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. అయితే, కౌటింగ్ మాత్రం జరపరాదని ఆదేశించింది. 
 
సుప్రీంకోర్టు తీర్పు మేరకు జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీకి నాలుగు వారాల గడువు ఉండాలన్న నిబంధన మేరకు ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మంగళవారం తీర్పునిచ్చారు. 
 
హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజ‌న్ బెంచ్‌‌కు అప్పీల్‌ చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన‌ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ తీర్పు వెల్ల‌డించింది. సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్వ‌ర్వుల‌ను డివిజ‌న్ బెంచ్ కొట్టివేసింది. 
 
షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని హైకోర్టు తెలిపింది. దీంతో రేపు జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు య‌థాత‌థంగా జ‌ర‌గ‌నున్నాయి. అయితే, త‌మ నుంచి త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చేవ‌ర‌కు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌కూడ‌ద‌ని హైకోర్టు ఆదేశించింది.
 
కాగా, ఇటీవ‌ల‌ సింగిల్‌ జడ్జి ఇచ్చిన‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎస్ఈసీ తరపున సీవీ మోహన్ రెడ్డి డివిజ‌న్ బెంచ్‌ను కోరిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయా అంశాల‌పై ప్ర‌తివాదుల త‌రపున వాద‌న‌లు కొన‌సాగాయి. 
 
టీడీపీ నేత‌ వర్ల రామయ్య తరఫున‌ సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్ర‌హ్మ‌ణ్యం తమ వాదనలను వినిపించారు. అన్ని వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.