గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (11:33 IST)

కొడుకు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తల్లి ఆరాటం.. తెదేపా

తన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు తల్లి వైఎస్. విజయలక్ష్మి తెగ ఆరాటపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ తన తండ్రిని చంపిన నిందితులను శిక్షించాలని రెండేళ్లుగా సునీతారెడ్డి చేస్తున్న ఆందోళన విజయలక్ష్మికి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. 
 
వివేకా హత్య కేసులో న్యాయం చేయని జగన్ రెడ్డిని వదలిపెట్టి, వాస్తవాలు రాసిన మీడియాను, వివేకాను హత్య చేసిన నిందితులను కనిపెట్టలేని జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్‌ను తప్పు పట్టడం సరికాదన్నారు. నిందుతుల్ని కాపాడుతున్నందుకు జగన్‌ను నిలదీయాలన్నారు. తిరుపతి ఎన్నికల్లో సీఎం జగన్ బండారం ఎక్కడ బయటపడుతుందోనని విజయలక్ష్మి ఈ లేఖలాస్త్రాలకు దిగారన్నారు. 
 
అలాగే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ జగన్ ఒక చెల్లిని మోసం చేసి హైదరాబాద్‌లో వదిలేశారని విమర్శించారు. మరొక సోదరిని డిల్లీలో వదిలేశారన్నారు. ఆనాడు సీబీఐ విచారణ కావాలన్న జగన్ ఇప్పుడు విచారణను ఎందుకు ముందుకు కదలనివ్వడంలేదని ప్రశ్నించారు. సిట్ విచారణ వేగంగా జరుగుతుంటే దాన్ని అడ్డుకుంది జగన్ కాదా? అని సూర్యప్రకాష్ నిలదీశారు.