శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

లాక్‌డౌన్‌ గురించి ఆలోచించండి ... : గుజరాత్‌ ప్రభుత్వానికి హైకోర్టు సూచన

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ఈ రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్వల్పకాల లాక్డౌన్‌ నిర్ణయాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి హైకోర్టు సూచించింది. 
 
గుజరాత్‌లో కొవిడ్‌ పరిస్థితులపై సుమోటోగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్‌ లేదా కర్ఫ్యూ అవసరమని అభిప్రాయపడింది. 'రాష్ట్రంలో కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. సోమవారం 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన, అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే పరిస్థితి చేదాటిపోయే ప్రమాదం ఉంది. ఓ మూడు నాలుగు రోజుల కర్ఫ్యూ లేదా లాక్డౌన్‌ విధించి పరిస్థితిని సమీక్షిస్తే బాగుంటుంది. ఈ అంశాన్ని పరిశీలించండి' అని హైకోర్టు ధర్మాసనం సూచన చేసింది. 
 
రాజకీయ కార్యక్రమాలు సహా సభలు, సమావేశాలను నియంత్రించాలని పేర్కొంది. ఆఫీసులు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య పరిమితం చేయడం వల్ల కూడా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని కోర్టు అభిప్రాయపడింది. 
 
న్యాయస్థానం సూచనలపై అడ్వొకేట్‌ జనరల్‌ కమల్‌ త్రివేది స్పందించారు. ‘‘లాక్డౌన్‌ విధించే అంశాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా పరిశీలిస్తోంది. అయితే పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు.