చంద్రబాబును కట్టడి చేసేలా ఆదేశాలివ్వండి... హైకోర్టులో సీఐడీ పిటిషన్...
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌తో మంగళవారం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, ఆయన మధ్యంతర బెయిల్ షరతులు విధించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్‌పై ఆంక్షలు విధించి, ఆయనను కట్టడి చేయాలని కోర్టును కోరింది.
ముఖ్యంగా, చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని విన్నవించింది. మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయకుండా ఆదేశించాలని కోరింది. కేవలం వైద్య చికిత్స చేయించుకోవడానికే ఆయనను పరిమితం చేయాలని విన్నవించింది. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది.
మరోవైపై, చంద్రబాబు తరపు న్యాయవాదులు సైతం కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ కోరుతున్న షరతులన్నీ చంద్రబాబు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరు తరపు వాదనలు ఆలకించిన హైకోర్టు తీర్పును ఈ నెల మూడో తేదీ అంటే శుక్రవారానికి వాయిదా వేసింది.