1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (07:26 IST)

పచ్చటి కోనసీమలో చిచ్చుకు కారణం ఆ రెండు పార్టీలే : మంత్రి వనిత

taneti vanitha
పచ్చటి కోనసీమలో చిచ్చు రాజుకోవడానికి మూల కారణం తెలుగుదేశం, జనసేన పార్టీలేనని ఏపీ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఆరోపించారు. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారు. దీన్ని ఆ జిల్లా వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
అయితే, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఫలితంగా జిల్లా కేంద్రమైన అమలాపురం అగ్నికి ఆహుతైంది. అధికార పార్టీకి చెందిన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. 
 
దీనిపై హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కోనసీమ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయనని వెల్లడించారు. జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సబబు కాదన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేసినందుకు గర్వించాలని ఆమె అభిప్రాయపడ్డారు.