1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (11:04 IST)

ఏపీ ఇంటర్ ఫలితాలు... ద్వితీయ సంవత్సరంలో 73.78 శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. ఏపీలో తొలిసారిగా ఒకేరోజు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 68.05కాగా, రెండో సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత 73.78 శాతంగా నమోదైంది. 
 
కాగా, గత యేడాదితో పోలిస్తే ఈ యేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత 5 శాతం పెరుగగా, రెండో సంవత్సరంలో ఉత్తీర్ణత 2 శాతం పెరిగింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వచ్చే నెల 24వ తేదీన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ ఏప్రిల్ 26గా నిర్ణయించామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. 
 
కాగా, ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలికలు 72.09 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 64.02శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఏ గ్రేడ్‌-58.29 శాతం, బి గ్రేడ్‌-25.85, సి గ్రేడ్‌-11.18, డిగ్రేడ్‌ 4.73 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ సంవత్సరం కృష్ణా జిల్లా 81 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలువగా, అనంతపురం జిల్లా 57శాతం ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది.
 
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు 76.43 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 71.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏ గ్రేడ్‌ 57.46 శాతం, బిగ్రేడ్‌-27.77, సి. గ్రేడ్‌11.14, డిగ్రేడ్‌ 3.62 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండియర్‌ ఫలితాల్లో సైతం కృష్ణా జిల్లా 84 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలువగా, కడప జిల్లా 67 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.