ఆదివారం, 10 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (09:26 IST)

రాష్ట్ర అప్పులపై మాట్లాడే నేతలను చెప్పుతో కొట్టండి :: మంత్రి దాడిశెట్టి రాజా

dadisetti raja
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ఎవరైనా అసత్యాలు మాట్లాడే నేతలను చెప్పుతో కొట్టాలని వైకాపా నాయకులకు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో వార్డు వాలంటీర్లు, నూతనంగా నియమితులైన పార్టీ సచివాలయ కన్వీనర్లతో ఆయన బుధవారం ఓ సమావేశం నిర్వహించారు. 
 
ఇందులో ఆయన ప్రసంగిస్తూ, అప్పులపై తెదేపా, మీడియా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఈ మూడున్నరేళ్లలో రూ.1.30 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వమే విడుదల చేసిందని పేర్కొన్నారు. 
 
తెదేపా ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా తూట్లు పొడిచారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చర్చించడానికి తాను సిద్ధమని.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సిద్ధమేనా? అని మంత్రి రాజా సవాల్‌ విసిరారు. 
 
ఎప్పుడు, ఎక్కడకు రావాలో యనమలే చెప్పాలన్నారు. ఓ సినీ నటుడు తాను చెల్లించిన పన్నులనే ప్రజలకు సీఎం జగన్మోహన్‌ రెడ్డి పంపిణీ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని పరోక్షంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించారు. 
 
ప్రభుత్వం నియమించే వాలంటీర్లు ఎవరో కాదని, వారు కూడా పార్టీ కార్యకర్తలేనని మంత్రి రాజా వ్యాఖ్యానించారు. న్యాయస్థానం వారిని పార్టీ పనులకు ఉపయోగించవద్దు.. అని చెప్పడంతో వార్డు సచివాలయ కన్వీనర్లను నియమించామన్నారు.