ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 జూన్ 2022 (12:05 IST)

అధికార మదం తలకెక్కితే ప్రజలు వాతలు పెడతారు : వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి

kotamreddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండేళ్ళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో అధికార పార్టీ నేతలకు అధికార మత్తు క్రమంగా దిగుతోంది. ప్రజలుతో తమకున్న వ్యతిరేకతను గ్రహిస్తున్నారు. దీంతో ఒక్కొక్కరుగా తమ ప్రవర్తనను మార్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. 
 
నెల్లూరులో జరిగిన రూరల్‌ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార మదంతో ప్రవర్తిస్తే, అధికార మదం తలకెక్కితే ప్రజలు వాత పెడతారని హెచ్చరించారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడవద్దని వైసీపీ శ్రేణులకు సూచించారు.
 
'వైసీపీ నాయకులకు, సర్పంచ్‌లకు, కార్యకర్తలకు చెబుతున్నా. ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడవద్దు. ఇబ్బందులు పెట్టవద్దు. మనం ఎంత తగ్గితే అంత మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను శత్రువులుగా చూడవద్దు. వారిని రాజకీయాల్లో పోటీదారులుగానే చూడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా.. మనం జనంకు జవాబుదారీగా ఉన్నాం. జగన్‌కు జవాబుదారీగా ఉన్నాం. అందరినీ ప్రేమిద్దాం. అందరినీ మిత్రులుగా చూద్దాం. శత్రువులుగా వద్దు. అధికార మదం తలకెక్కితే, అధికార మదంతో ప్రవర్తిస్తే ప్రజలు చెప్పాల్సిన రోజు, చెప్పాల్సిన విధంగా వాత పెడతారు సోదరులారా' అంటూ హితవచనాలు పలికారు.