రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము.. దేశంలో పండుగ వాతావరణం : జీవీఎల్
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిండంతోనే దేశ వ్యాప్తంగా సానుకూల, పండుగ వాతావరణం నెలకొందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. ఆయన ఢిల్లీలో తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, ఆదివాసీ మహిళ, కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా, గవర్నర్‌గా అన్ని విధాలా సుశిక్షితురాలైన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో పండగ వాతావరణం నెలకొందన్నారు. దేశానికి వన్నె తెచ్చే ఓ గొప్ప మహిళ ఆమె. ప్రతిపక్షాలు సైతం మద్దతు ఇస్తున్నాయి అని చెప్పారు.
అదేసమయంలో రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు రాష్ట్రాల వారు ఉంటే ఎంతో సంతోషించే వాళ్లమనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. కానీ, ద్రౌపది ముర్ము పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతోనే దేశవ్యాప్తంగా ఇంత సానుకూల వాతావరణం నెలకొనడం గత మూడు దశాబ్ధాల్లో తానెప్పుడూ చూడలేదన్నారు. అందువల్ల ఆమెపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలన్నారు.