మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (16:52 IST)

అంబేద్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు ఆ పేరు పెట్టొచ్చుగా : జీవీఎల్

gvl narasimha
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పట్ల అంత గౌరవం, ప్రేమ మర్యాదలు ఉంటే నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చు కదా అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ప్రశ్నించారు. 
 
అమలాపురం జిల్లా కేంద్రంలో జరిగిన విధ్వంసం, ఘర్షణలపై ఆయన మాట్లాడుతూ, నిత్యం పచ్చగా, ప్రశాంతంగా ఉండే కోనసీమలో జరిగిన హింసాత్మక ఘటనలను ఖండిస్తున్నట్టు చెప్పారు. అంబేద్కర్ పేరును రాజకీయాల్లోకి లాగడం దారుణమన్నారు. ఒక ప్రణాళిక ప్రకారమే అమలాపురంలో హింస జరిగిందని ఆయన ఆరోపించారు. ఒక మంత్రికే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
కోనసీమలో జరిగిన హింసాత్మక ఘటనలన వెనుక వైకాపా భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, దళితుల హత్యల నుంచి దృష్టి మళ్లించేందుకే వైకాపా నేతలు ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. అంబేద్కర్‌పై అంతలా అభిమానం ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చు కదా అని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు.