శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (15:38 IST)

మంత్రి హోదాలో ఉన్న కులవృత్తిని మరచిపోని ఎమ్మెల్యే.. ఎవరు?

ఆయన యువ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపాకు చెందిన నేత. ఇటీవలే అనూహ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయినప్పటికీ ఆయన తన కులవృత్తిని మరిచిపోలేదు. తాను మంత్రిని కదా అని పొంగిపోలేదు. దసరా పర్వదినం రోజున ఆటవిడుపుగా తన కులవృత్తిలో నిమగ్నమయ్యారు. భావనపాడు హార్బరులో ఆయన తన కుటుంబ సభ్యులతో సముద్ర స్నానం చేసి ఆ తర్వాత చేపలవేట సాగించారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
మత్స్యకార కుటుంబంలో పుట్టిన అప్పలరాజు చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు. దాంతో ఆయన తన కుటుంబసభ్యుల్లా చేపలవేటలో పాలుపంచుకోలేకపోయారు. అధికభాగం చదువుతోనే సాగింది. ఆ తర్వాత వైద్య వృత్తి, ఆపై రాజకీయాలు, ఇటీవల మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ మంత్రి పదవితో మరింత బిజీ అయ్యారు.
 
అయితే దసరా పండుగ సందర్భంగా ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి భావనపాడు పోర్టును సందర్శించారు. అక్కడ తన సోదరుడు చిరంజీవి, చిన్ననాటి మిత్రులతో కలిసి సముద్రంలోకి వెళ్లి చేపల వేట సాగించారు. సముద్రతీరంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భోజనాలు చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు ఎంతో ఉల్లాసంగా గడిపారు.