మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (11:16 IST)

అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలొద్దు.. జూనియర్ ఎన్టీఆర్ (video)

సమాజంలో జరుగుతున్న నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై హైదరాబాద్ నగర పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు నేరాలతో పాటు సామాజిక చైతన్యం కలిగించేలా వీడియోలను రూపొందించి అవగాహన కలిగించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ఎప్పుడూ ముందే ఉంటారు.

అంతేకాకుండా కరోనా విపత్కర పరిస్థితుల్లో.. ఈ మహమ్మారి సోకి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని టాలీవుడ్ పెద్ద పెద్ద హీరోలతో సైబరాబాద్ పోలీసులు కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగరంలో అపూర్వ స్పందన సైతం లభించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పోలీసులు తాజాగా సైబర్ మోసాలపై ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌‌తో ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో ఓ యువతికి ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి ద్వారా ఆమెకు ఎదురైన అనుభవాన్ని చూపించడంతో పాటు ఎన్టీఆర్ సందేశాన్ని జోడించారు హైదరాబాద్ పోలీసులు.
 
ఈ వీడియోలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి ద్వారా మహిళ ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. చివరలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇలాంటి మోసాలలో చిక్కుకోకుండా ఉండేందుకు యువత తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
 
'వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. జాగ్రత్త!' అంటూ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. యువతకు ఆయన ఇచ్చిన సందేశం నెటిజన్ల చేత భేష్ అనిపించుకుంటోంది.