శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (08:52 IST)

భైంసాలో ప్రేమ జంటను చంపేందుకు కారుతో ఢీకొట్టించి...

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా భైంసాలో దారుణ ఘటన జరిగింది. ఓ ప్రేమ జంటను హత్య చేసేందుకు కొందరు వ్యక్తులు ప్లాన్ వేశారు. బైకులో వెళుతున్న ప్రేమ జంటను కారుతో ఢీకొట్టించి చంపేందుకు ప్రయత్నించారు. కారుతో ఢీకొట్టగానే ప్రేమ జంట బైకు కిందపడిపోయింది. ఆ తర్వాత కారులోని వ్యక్తులు దిగి వారిపై కర్రలతో దాడి చేశారు. పెద్దలకు ఇష్టంలేకుండా వివాహం చేసుకున్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భైంసా పట్టణానికి చెందిన నాగజ్యోతి, అక్షయ్‌ అనే యువతీ యువకులు గతేడాది మే 28న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నెల రోజుల క్రితం తల్లికి గుండెనొప్పి వచ్చిందని నాగజ్యోతికి కబురు చేయడంతో ఆమె తల్లిని చూసేందుకు ఇంటికి వెళ్లింది. 
 
ఇంటికొచ్చిన ఆమెను విడాకులు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేశారు. పైగా, తమ మాట వినకుంటే అక్షయ్‌ను చంపేస్తామని బెదిరించి ఈ యేడాది ఆగస్టులో విడాకులు ఇప్పించారు. విడాకులు తీసుకున్నప్పటికీ నాగజ్యోతి, అక్షయ్‌ల మధ్య మాటలు కొనసాగుతున్నాయి.
 
కల్లూరులోని వాసవి కళాశాలలో డిగ్రీ పరీక్షలు రాసేందుకు బుధవారం నాగజ్యోతి వెళ్లింది. పరీక్షల అనంతరం అక్షయ్‌తో కలిసి బైక్‌పై వస్తుండగా నాగజ్యోతి ముగ్గురు సోదరులు వారిని కారుతో వెంబడించారు. బిజ్జూరు, చింతల్‌బోరి గ్రామాల మధ్య బైక్‌ను ఢీకొట్టారు. 
 
అనంతరం అక్షయ్‌పై కర్రలతో దాడిచేశారు. ప్రమాదంలో నాగజ్యోతికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వీరిద్దరూ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.