శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 31 జులై 2020 (12:36 IST)

కరోనా కలిపింది ఇద్దరనీ, పెళ్లితో ఒక్కటైన పాజిటివ్ ప్రేమికులు

ఇది పాజిటివ్ ప్రేమకధ... అమ్మాయిది గుంటూరు జిల్లా, అబ్బాయిది  ప్రకాశం జిల్లా. అబ్బాయి హైదరబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి ఉద్యోగ ప్రయత్రాలు చేస్తోంది. వీరిద్దరకీ పరిచయం కావడానికి వేదిక కార్పొరేట్ ఆసుపత్రి అయితే ప్రేమ పుట్టడానికి మాత్రం కచ్చితంగా కరోనానే.
 
వీరిద్దరికీ టెస్టుల్లో పాజిటివ్ రావడంతో ఇద్దరూ ఆసుపత్రిలో చేరారు. పాజిటివ్ వార్డులో పక్క పక్క బెడ్స్ మీద ఉండేవారు. లక్షణాలు ఏమీ లేకపోవడంతో నిశ్చింతగా బయటపడతాం.. అని ఒకరికి ఒకరు ధీమా చెప్పుకున్నారు. భయపడితే కరోనా ఇంకా భయపెడుతుందని ధైర్యం చెప్పుకున్నారు. యోగా, ప్రాణాయామాలు. స్పూర్తినిచ్చే సూక్తులు ఇద్దరూ కలిసే పంచుకున్నారు. ఇంకేముంది ఇరువురు మనసులు కలిశాయి.
 
ఇద్దరదీ ఒకే సామాజికవర్గం కావడంతో పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇదే విషయాన్ని ఆసుపత్రి నుంచే తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పారు. పెద్దలు కూడా వీరి అభిప్రాయాలను గౌరవించి పెళ్లికి ఓకే  చెప్పారు. పది రోజులు తరువాత పరీక్షలు నిర్వహిస్తే ఇద్దరకీ నెగిటివ్ రావడంతో డాక్టర్లు డిశ్బార్జ్ చేశారు.
 
ఇంకేముంది గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ నెల 25 తేదీన ఇరువురు తల్లిదండ్రులు, పెద్దలు సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇదంతా 15 రోజుల్లో జరిగిపోవడం విశేషం. ముగింపు ఏంటంటే ‘కరోనా కలిపింది ఇద్దరనీ’ అంటూ పెళ్లికి వచ్చిన పెద్దలు అక్షింతలు వేసి దీవించారు.