బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 17 మే 2021 (19:52 IST)

ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందుల్ని అధిగమించి రోగులకు భరోసా ఇస్తున్న ఎపి పోలీస్

కరోనా రోగులకు అత్యంత  అవసరమైన ఆక్సిజన్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ విషయమై, గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలకు అనుగుణంగా ప్రాణ వాయువు వేగంగా, సురక్షితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు సకాలంలో అందేలా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ విశేషమైన కృషి చేస్తోంది.  ఆక్సిజన్  సరఫరా కారణంగా ప్రజలెవరూ ఇబ్బంది పడగూడదనే లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
 
 
ఆక్సిజన్ ట్యాంకర్లకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాకు ఎటువంటి అవరోధాలు లేకుండా పోలీసు శాఖ పకడ్బందీ ప్రణాళిక రచించింది. ఆక్సిజన్ సరఫరా చేసే 11 ప్లాంట్లను మాపింగ్ చేసి అక్కడ నుండి ఎటువంటి అవరోధాలు లేకుండా రవాణా జరిగేలా డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ చర్యలు చేపట్టారు. ఒరిస్సా, తమిళనాడు మరియూ కర్ణాటక డి‌జి‌పిలతో వారు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు.

ఆయా రాష్ట్రాలలో ఆక్సిజన్ ట్యాంకర్లు ప్రయాణించే మార్గాలలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎస్కార్ట్ వాహనాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకొన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లకు జీపీఎస్ అమర్చేలా చర్యలు తీసుకొంటున్నారు. ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల శాంతిభద్రతల అదనపు డీజీలతో ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ అదనపు డి‌జి‌పి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు కోవిడ్ కంట్రోల్ రూమ్ ఆయా రాష్ట్రాల కంట్రోల్ రూములతో సమన్వయం చేసుకొంటోంది. ఈ సదుపాయం వల్ల ఇప్పటికే చాలా సమయం ఆదా చేయగలిగారు. 
 
అంగూల్, కళింగ నగర్, దెంకనాల్ నుండి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్లను ఒరిస్సా రాష్ట్రా నికి చెందిన ఎస్కార్ట్ వాహనాలు ఇచ్చాపురం చెక్ పోస్ట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ పోలీసుకు అప్ప చెప్పేలా ఏర్పాట్లు చేశారు.

ఆక్సిజన్ సరఫరా వాహనాల సిబ్బంది సౌకర్యాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎపి పోలీస్
రాష్ట్రంలో ప్రవేశించిన ప్రతి టాంకర్ డ్రైవర్ మరియూ సిబ్బందికి శ్రీకాకుళం పోలీసు శాఖ ఆహార పొట్లాలు, అల్పాహారం మరియూ మంచి నీరు అందిస్తున్నారు. తద్వారా ప్రయాణ సమయం తగ్గేలా చేస్తున్నారు. వేలాది మంది ప్రాణాలకు సంబందించిన విషయం కాబట్టి, ప్రతి క్షణం విలువతో కూడుకున్నది కాబట్టి, ఇటువంటి సదుపాయం ఏర్పాటు చేశారు. 
 
అంతే కాకుండా అదనపు డ్రైవర్లు, రిపేర్ వచ్చిన సందర్భంలో టెక్నీషియన్ల ఏర్పాటు, NHAI తో సమన్వయం, ట్రాఫిక్ జామ్ నియంత్రణకు క్రేన్ల ఏర్పాటు మొదలగు చర్యలు చేపడుతోంది. ఇచ్చాపురం నుండి బయలు దేరిన వాహనం విజయ నగరం జిల్లాలో ప్రవేశించగానే కందివలస చెక్ పోస్ట్ దగ్గర ఆ జిల్లా పోలీసు శాఖ ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేసినది. ఆ విధంగా 18 పోలీసు యూనిట్లలో ఆయా జిల్లా సరిహద్దులలో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి అత్యంత సమన్వయంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులు దాటే సమయంలో ఆయా ఎస్పీలు సమన్వయం చేసుకుంటున్నారు.
 
కర్ణాటక రాష్ట్రం, బళ్లారి పట్టణంలో ఉన్న JSW, లిండే ప్లాంట్ల నుండి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్లకు, అదేవిధంగా శ్రీ పేరంబుదూర్‌లో ఉన్న ఐనాక్స్ ప్లాంట్, సేంట్ గోబిన్‌లో ఉన్న లిండే ప్లాంట్ల నుండి బయలుదేరే ఆక్సిజన్ ట్యాంకర్లకు ఎస్కార్ట్ వాహనంతో పాటు పోలీసు కానిస్టేబుల్ ఆ వాహనంలో కూర్చొని ప్రయాణించేలా ఏర్పాటు చేసారు.
 
అదేవిధంగా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర ఇరుగు పొరుగు రాష్ట్రాలకు మన రాష్ట్రం మీదుగా వెళ్లే ఆక్సిజన్ ట్యాంకర్లకు సైతం ఎస్కార్ట్ వాహనాలు ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్ ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ నుండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు
 
ముగ్గురు ఐపీఎస్ అధికారులు స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ నుండి ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో జిల్లా ఆక్సిజన్ వార్ రూమ్‌తో జిల్లా ఎస్పీ లు సమన్వయం చేసుకుంటున్నారు. 
 
శభాష్ కర్నూల్ పోలీసు:
తెలంగాణ ఆంధ్ర సరిహద్దులలో నిలిచిపోయిన అంబులెన్స్‌లలో ఆక్సిజన్ అందక కొట్టుమిట్టాడుతున్న రోగులకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో తక్షణం ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేయడం, ఆస్పత్రులలో అడ్మిషన్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయం. అభినందనీయం. ఇటువంటి సందర్భంలో మానవీయ కోణం ఆవిష్కృతం కావడం ముదావహమని డి‌జి‌పి గారు ప్రశంసలు కురిపించారు.
 
ఆక్సిజన్, వాక్సినేషన్ వాహనాలకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసే క్రమంలో నిన్న అర్థ రాత్రి 2 గంటల సమయంలో ఎస్కార్ట్ డ్యూటీ చేస్తూ, తూర్పు గోదావరి జిల్లా హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ  మరియూ హోమ్ గార్డ్ నారాయణరెడ్డిలు ప్రమాదానికి గురై మరణించడం అత్యంత బాధాకరమని డీజీపీ గారు తెలియజేసారు.  ఆ కుటుంబాలకు డి‌జి‌పి ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తూ  వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొంటామని తెలిపారు.