గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2025 (15:29 IST)

వల్లభనేని వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు... ఎస్కార్ట్‌తో తరలింపు (Video)

vallabhaneni vamsi wife
వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని వంశీ భార్య పంకజశ్రీ అనుసరిస్తూ వచ్చారు. నందిగామ వద్ద ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 
 
తాము నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నామని, ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుందని, తను అనుసరించవద్దని ఆమెకు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న ఓ డ్రైవింగ్ స్కూల్‌లో ఆమెను ఉంచారు. ఆమె ఫోనును కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 
 
ఇదిలావుండగా, వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన వద్ద విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఆయన వైద్యపరీక్షలు నిర్వహించి, జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 
 
మరోవైపు వల్లభనేని వంశీ న్యాయవాదులు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. వంశీపై ఏడు సెక్షన్ల కింద్ కేసులు నమోదు చేశారు. ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. ఇంకవైపు, గన్నవరంతో పాటు కృష్ణలంక పోలీస్ట్ స్టేషన్ వద్ద భద్రతను పెంచారు.
 
వంశీ అరెస్టు నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇది అక్రమ అరెస్ట్ అంటు వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులు ఉండరాదంటూ హిత వచనాలు పలుకుతున్నారు. మరోవైపు, టీడీపీ నేతలు మాత్రం వంశీ వంటి వ్యక్తులను చట్టపరంగా శిక్షించాల్సిందేనంటూ అభిప్రాయపడుతున్నారు.