శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 8 నవంబరు 2017 (22:11 IST)

ఔను... పేపర్లో చూశా... సభకు జగన్ వస్తే బావుంటుంది... స్పీకర్ కోడెల

అమరావతి: శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, వివరాలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, ప్రత్యేక ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులను శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు కోరారు. శాసనసభా ప్రాంగణం సమావేశ మందిరంలో బుధవ

అమరావతి: శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, వివరాలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, ప్రత్యేక ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులను శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు కోరారు. శాసనసభా ప్రాంగణం సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జరిగిన ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ వర్షాకాల, శీతాకాల సమావేశాలు రెండూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశాలు 10 నుంచి 15 పని దినాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత ఎన్ని రోజులు సభ నిర్వహించేది తెలియజేస్తానని చెప్పారు. 
 
సభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు అందడంలేదని, అలా అందని ప్రశ్నలు 296 ఉన్నట్లు తెలిపారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు, అడిగిన సమాచారం ఇవ్వడానికి ప్రతి శాఖలో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తే, వారు సకాలంలో పంపడానికి అవకాశం ఉంటుందని సలహా ఇచ్చారు. ఈసారి సభకు సకాలంలో సమాధానాలు అందజేయాలని, నీటిపారుదల, పరిశ్రమల శాఖలకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా సమ్మిళిత వృద్ధి, మహిళాసాధికారిత, శిశుసంక్షేమం, బాలల హక్కులు వంటి అంశాలను సభలో చర్చిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
సభలో బిల్లు పెట్టే విషయం అప్పటికప్పుడు కాకుండా ముందుగా తెలియజేయాలని కార్యదర్శులకు సూచించారు. ప్రతిపక్షం వారు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పేపర్లలో చూశానని, అయితే వారు కూడా సభలో పాల్గొని అన్ని అంశాలు చర్చిస్తే బాగుంటుందని, వారిని కూడా సభకు రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని డాక్టర్ కోడెల చెప్పారు. 
 
శాసనమండలి ఇన్‌చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో సభలో సభ్యులు అడిగిన 545 ప్రశ్నలకు, 58 ప్రత్యేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని, సమాధానాలు సకాలంలో అందివ్వాలని కోరారు. సభ్యులకు ప్రొటోకాల్ పాటించడంలేదని, ఈ విషయమై జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. సభ సజావుగా సాగేందుకు, సమాచారం అందజేయడంలో అధికారులు సహకరించాలని కోరారు.
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించి, శాసనసభ వ్యవహారాలకు సహకరించాలన్నారు. సాధారణంగా నీటిపారుదల, పంచాయతీరాజ్ వంటి శాఖలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కవగా ఉంటాయని, ఆ సమాచారం సకాలంలో అందించమని ఆదేశించారు. పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలను, సమాధానాలను వెంటనే వెబ్ సైట్ లో పెట్టే విషయం గుర్తు చేశారు. శాసనసభకు కావలసిన సమాచారం అందించడానికి ప్రతి శాఖలో ఒకరికి బాధ్యతలు అప్పగించమని ఆదేశించారు.