ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (19:30 IST)

అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌: సీఎం చంద్రబాబు

Chandra babu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను త్వరలో ఏర్పాటు చేయనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు అవలంభిస్తున్న విధానాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా పారిశ్రామిక విధానాలు ఉండాలని, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు బాటలు వేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు.
 
ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల విధానంపై మరింత కసరత్తు అవసరమని భావించిన ఆయన, తదుపరి సమావేశంలో మిగతా మూడు విధానాలను క్యాబినెట్ ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ఆయా అంశాలపై రూపొందించిన విధానాలను అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించడంతో చంద్రబాబు వాటిపై లోతుగా అధ్యయనం చేసి తన అభిప్రాయాలను, అనుభవాలను అధికారులతో పంచుకున్నారు.
 
అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ హబ్‌కు గత వారం దివికేగిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరు పెట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, స్టార్టప్‌లు, ఫెసిలిటేషన్‌ సెంటర్‌, ఇన్నోవేషన్‌లకు ఈ హబ్‌ కేంద్రంగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఐదు చోట్ల ఈ తరహా హబ్‌లు ఏర్పాటు చేసి ఒక్కో హబ్‌కు ఒక పెద్ద కంపెనీ మెంటార్‌గా వ్యవహరిస్తుంది.
 
ఇన్నోవేషన్ హబ్‌లు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రానికి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు. ఈ కొత్త విధానాలు అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి రాయితీలు వర్తింపజేస్తామని చెప్పారు.