శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జులై 2019 (16:43 IST)

శవాల మీద పేలాలు ఏరుకున్న తెదేపా నేతలు : మంత్రి అనిల్

ఏపీ అసెంబ్లీ శాసన సభ సమావేశాల్లో భాగంగా వంశధార నిర్వాసితులకు అన్యాయం జరిగిందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో వంశధార నీటిపారుదల ప్రాజెక్టుపై ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం అని ఆమె తెలిపారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక వంశధార ప్రాజెక్టు పనులు 80 శాతం పనులు పూర్తి అయ్యాయని ఆమె అన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేయాలని వైయస్‌ఆర్‌ గారు కృషి చేశారని అన్నారు. 
 
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే, నేరేడు బ్యారేజీ కడితే శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాలకు నీరు అందించివచ్చని ఆమె తెలిపారు. మహానేత వైయస్‌ఆర్‌ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాయని ఆమె అన్నారు. వంశధార ప్రాజెక్టులో భారీ స్కాం జరిగిందని ఆమె తెలిపారు. 
 
వెనుకబడిన ప్రాంతంలో ఏం చేసినా ఎవ్వరూ పట్టించుకోరన్న భావనతో.. అక్కడ నుంచి ఎన్నికైన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోకి తీసుకుని ఫిరాయింపులకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజాతీర్పుకు విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఫిరాయింపులు ప్రోత్సహించి తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. సరిహద్దు రాష్ట్ర సీఎం నవీన్‌పట్నాయక్‌ నాకు మంచి మిత్రుడని చంద్రబాబు చెప్పుకొనేవారు తప్ప, ఏనాడూ నేరేడు బ్యారేజ్‌ కట్టడానికి చొరవ చూపలేదని రెడ్డి శాంతి మండిపడ్డారు. 
 
ప్రజలకు అభివృద్ధి అందజేయాలనే ధ్యాస గత ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ప్రజలకు రావాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వలేదని, దరఖాస్తులను చెత్తబుట్టలో పడవేశారన్నారు. నిర్వాసితుల పేరుతో రూ.420 కోట్లు కేటాయింపులు చేశారని అందులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని దాన్ని బయటపెట్టాలని రెడ్డి శాంతి డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని, అందులో అవినీతి అంశాలను బయటకు తీసి సమగ్ర విచారణ జరిపించాలని రెడ్డి శాంతి డిమాండ్‌ చేశారు. వంశధార నిర్వాసితులపై పోలీసులు దమనకాండ చేశారని అన్నారు. 
 
దీనిపై సాగునీటి శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సమాధానమిస్తూ, 2005లో 6,800 మంది నిర్వాసితులకు చెల్లింపులు చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం వచ్చాక 460 జీఓ ప్రకారం 400 కోట్లులో 396 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద నిర్వాసితులకు ఎంత ఇచ్చినా తక్కువే. దాంట్లోనూ అవకతవకలు జరుగుతున్నాయంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదని అనిల్‌ మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు ఉందని అనొచ్చని అన్నారు. 
 
నిర్వాసితుల పేర్లతో సంబంధం లేని 3,000 మందికి అదనంగా చెల్లింపులు చేశారని అన్నారు. ప్రతి కుటుంబం వివరాలు తెప్పించి అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కేవలం వంశధార మాత్రమే కాదు.. పోలవరం కుడి ప్రధాన కాల్వలోనూ అవినీతి జరిగిందని ఒకచోట ఎక్కువ ఇచ్చారని, ఒకచోట తక్కువ ఇచ్చారని వీటన్నింటిపై.. సమగ్రంగా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని అన్నారు.