మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

చిట్టచివరి భూముల వరకూ సాగునీరందిస్తాం..: మంత్రి అనిల్ కుమార్

ఖరీఫ్‌లో రైతులు పంటలు సాగు చేసుకోవడానికి కాలువ చిట్టచివరి భూముల వరకు నీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సాగు, త్రాగునీటి అవసరాల కోసం కృష్ణాజిల్లాలోని కాలువలకు ప్రకాశం బ్యారేజ్ నుండి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం కె.ఈ. కెనాల్ హెడ్ స్లూయిస్ వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి నీటిని విడుదల చేశారు. 
 
ఈసందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడం గోదావరికి వరద కూడా ఆలస్యం కావడంతో కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. రాబోయే పది రోజుల్లో కృష్ణా పశ్చిమ డెల్టాకు కూడా నీరు విడుదల చేయడం జరుగుతుందన్నారు. 
 
జిల్లా కలెక్టర్ ఎ.ఎం.డి. ఇంతియాజ్ మాట్లాడుతూ గోదావరికి వరద రావడంతో గోదావరి సిస్టంలోని 23 పంపులు ఆన్ చేసి నీరు తీసుకురావడం జరిగిందన్నారు. రెండు రోజుల్లోనే 0.8 టి.యం.సి. నీరు వచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి నీరుచేరగానే సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకొని కృష్ణా డెల్టా రైతాంగానికి ప్రస్తుతం 1000 క్యూసెక్కుల నీటిని కె.ఇ.బి.కెనాల్‌కు విడుదల చేయడం జరిగిందన్నారు. కృష్ణా డెల్టాకు సుమారు 150 టియంసిల నీరు అవసరం అవుతుందని, 80 టియంసిలు గోదావరి నుండి 60 టియంసిలు పులిచింతల నాగార్జునసాగర్ నుండి మిగిలినవి మునేరు ఇతర నీటి వనరుల నుండి వస్తాయన్నారు.