సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (12:34 IST)

శివాజీకి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు... ఎందుకంటే?

తెలుగు హీరో శివాజీని తెలంగాణ రాష్ట్రంలోని సైబరాబాద్ పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల విచారణ తర్వాత ఆయన్ను వదిలివేశారు. తాము పంపించిన నోటీసులకు స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించివేసినట్టు తెలుస్తోంది. 
 
ఇటీవల అలంద మీడియా(టీవీ9) షేర్ల కొనుగోలు వ్యవహారంలో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో శివాజీ నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులో టీవీ మాజీ సీఈఓ రవి ప్రకాష్‌తో పాటు శివాజీకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన రవి ప్రకాష్ విచారణకు హాజరయ్యారు. 
 
కానీ, శివాజీ మాత్రం విచారణకు డుమ్మాకొట్టారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు పారిపోతుండగా, సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన పాస్ పోర్టును సీజ్ చేశారు.
 
ఈ సందర్భంగా ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. జూలై 11వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం వదిలిపెట్టారు. దీంతో తన కారులో శివాజీ ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో శివాజీని ఎయిర్ పోర్టులో గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు వచ్చి శివాజీని అదుపులోకి తీసుకున్నారు.