శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (12:50 IST)

ఎన్నికల డ్యూటీ వద్దా! వైన్ షాపులంటే ముద్దా?: టిడిపి

రాష్ట్ర ఎన్జీవో సంఘాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సచివాలయ ఉద్యోగలసంఘాధ్యక్షుడు వెంకట్రామ రెడ్డిల తీరును టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నాయకులు  ఉద్యోగ సంఘనేతలా లేక అధికార పార్టీ సేవకులా తేల్చి చెప్పాలని నిలదీశారు. ఎన్నికల డ్యూటీ వద్దనే వీరికి వైన్ షాపుల ముందు డ్యూటీ వేస్తే ముద్దా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా  వీరు మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరంగా వుందన్నారు.

స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ నిర్ణయాన్ని ఉద్యోగుల వ్యతిరేకించడం ధ‌ర్మం కాదన్నారు. పార్టీ రహితంగా, వెయ్యి, రెండు వేల మంది ఓటర్లు వున్న పంచాయతీకు ఎన్నికలు జరిగితే వచ్చే ప్రమాదం ఏమీలేదన్నారు. దేశంలో పలుచోట్ల ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని  ఈ నేతలు విస్మరించడం వెనుక కులతత్వం దాగి వుందని చెప్పారు. 

కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డికి వైకాపా నేతలతో బంధుత్వం ఉందన్నారు. వెంకట్రామ రెడ్డి భార్య శ్వేతా రెడ్డి గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా టిక్కెట్ ఆశించి ప్రచారం చేశారని తెలిపారు. కులం, స్వార్థం కోసమే వీరు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.

పి ఆర్ సి, సి పి ఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల భద్రత లాంటి ఉద్యోగుల సమస్యలు ఏనాడూ పట్టించుకోని వీరు ఎన్నికల డ్యూటీ చేస్తే ప్రాణాలు పోతాయనడం హాస్యాస్పదం అన్నారు. ఎన్నికల సంఘం ఉద్యోగుల రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదని చెప్పారు.

వేలాది మందితో ఊరేగింపులు సభలు నిర్వహిస్తే సోకని కరోనా ఎన్నికలు నిర్వహిస్తే ఎలా వస్తుందో ఆ మేధావులు ఇద్దరూ చెప్పాలన్నారు. రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్న వీరిపై శాఖాపర చర్యలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.