బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (18:01 IST)

ఏపీలో టీడీపీ నేతల ఇళ్ళపై వరుస దాడులు : విజయవాడలో పట్టాభి నేత ఇంట్లో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతల ఇళ్లలో ఏపీ పోలీసులతో పాటు దుండగులు వరుసగా దాడులు చేస్తున్నారు. తాజాగా విజయవాడలోని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నివాసంపై దుండగులు దాడి చేశారు. 
 
విజయవాడలోని పట్టాభి ఇంట్లోకి చొరబడిన దుండగులు అక్కడున్న సామగ్రిని ధ్వంసం చేశారు. ఇదిలావుంచితే, సీఎం జగన్‌పై పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పలు జిల్లాల్లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.
 
టీడీపీ నేతల్లో క్రమం తప్పకుండా గళం వినిపించే వారిలో పట్టాభి ఒకరు. ఆయన తరచుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సీఎం జగన్‌ను, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో పట్టాభి చేసిన విమర్శలు వైసీపీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేశాయి. గతంలోనూ ఓసారి పట్టాభి వాహనాన్ని దుండగులు ధ్వసం చేయడం తెలిసిందే.
 
మరోవైపు, ఏపీలో గంజాయి అక్రమ రవాణా, వినియోగం అడ్డుఅదుపు లేకుండా సాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించడం, గంజాయి వ్యవహారంపై మీరు ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారో ఆ ఆధారాలు తమకు ఇవ్వాలంటూ నర్సీపట్నం పోలీసులు నిన్న రాత్రి గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లడం తెలిసిందే. 
 
ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశాఖలో గంజాయి దందాకు సంబంధించి నక్కా ఆనంద్ బాబు వాంగ్మూలాన్ని పోలీసులు నేడు నమోదు చేసుకున్నారు. ఓ ప్రెస్ మీట్ లో నక్కా ఆనంద్ బాబు గంజాయి దందాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
ఆనంద్ బాబు ప్రెస్మీట్‌లో చెప్పిన విషయాలను పోలీసులు తీవ్రంగా పరిగణించి గత అర్థరాత్రి ఆయన నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే నోటీసులు తీసుకునేందుకు ఆనంద్ బాబు నిరాకరించారు. దాంతో పోలీసులు మంగళవారం మరోసారి ఆయన నివాసానికి వెళ్లారు.
 
కాగా, పోలీసుల తీరుపై నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ మాజీ మంత్రినని, తన అభిప్రాయాలు చెప్పేంత స్వేచ్ఛ కూడా ఇవ్వరా? అని మండిపడ్డారు. ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా?... పోలీసులకు ఆధారాలు ఇవ్వాల్సింది మేమా? అని నిలదీశారు.