సమాధి తవ్వుకుని అందులోనే అన్నదాతల వినూత్న నిరసన
రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజటానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి భూములు వదులుకుంటున్న అన్నదాతలెందరో.
తాజాగా యూపీలో కూడా భూసేకరణ చేయాలని యోగి సర్కార్ నిర్ణయించింది. ఘజియాబాద్‌లోని మండోలా విహార్ పథకం ద్వారా అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా ఆరు గ్రామాలకు చెందిన రైతులు భూ సమాధి ఉద్యమాన్ని చేపట్టారు.
సమాధిలా తవ్వి అన్నదాతలు అందులో కూర్చున్నారు. తమకు పరిహారంతో పాటు, ఇతర పునరావాస కార్యక్రమాలు చేపట్టేదాక సమాధి నుంచి బయటకు రామని కరాఖండిగా చెబుతున్నారు.
2016 డిసెంబర్ 2న మండోలా సహా ఆరు గ్రామాల రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రారంభించారు. ఇపుడు వినూత్నంగా సమాధి తవ్వుకుని ఆందోళనకు దిగటం విశేషం.