శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (20:22 IST)

ఓటు హక్కులేని పిల్లల కోసం వేలకోట్ల ఖర్చు: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

ఓట్ల కోసం, ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్ తరాల బాగు కోసం పనిచేస్తున్న నిజమైన ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. ఓటు హక్కు లేని విద్యార్థుల మేలు కోసం, వారు చదువుకొనే బడుల కోసం వేల కోట్ల రుపాయలను వెచ్చించడమే దీనికి తార్కాణమని పేర్కొన్నారు. 
 
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గిరిజన గురుకుల బాలికల పాఠశాల అదనపు భవనాలను, డిజిటల్ క్లాస్ రూములను బుధవారం ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రాధాన్యతాంశాలు విద్యా, వైద్యం, వ్యవసాయం అని చెప్పారు.

విప్లవాత్మకమైన నిర్ణయాలతో సమూలమైన మార్పులను తీసుకొచ్చి విద్యాభివృద్ధికి పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని చెప్పారు. రాజకీయ పార్టీలు, రాజకీయనాయకులలో చాలా మంది ఎన్నికల కోసం చూస్తారని, ఓటర్ల కోసం మాత్రమే పని చేస్తారని, అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓటు హక్కు లేకపోయినా పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాలు బాగుకోసం పని చేస్తున్నారని కితాబిచ్చారు.

ఈ నేపథ్యంలోనే పేద పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదువు మాత్రమేనని నమ్మిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎవరూ పట్టించుకోని పాఠశాలల సంక్షేమానికి పెద్ద పీట వేసారని నాడు నేడు పథకం ద్వారా 15 వేల పాఠశాలల రూపురేఖలను మార్చేసారని తెలిపారు. అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి విశిష్టమైన పథకాల ద్వారా విద్యార్థులకు అవసరమైన ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలతో పాటుగా నాణ్యమైన పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని తెలిపారు.

తాను కూడా గిరిజన పాఠశాలలోనే చదువుకున్నాని అయితే తాము చదువుకొనే సమయంలో పాఠశాలలో కనీస వసతులు కూడా ఉండేవి కావని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వహయాంలో 2016 లో గిరిజన వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలలుగా అప్ గ్రేడ్ చేస్తూ జీఓ ఇచ్చి చేతులుదులిపేసుకున్నారని ఈ కారణంగా విద్యార్థులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావని చెప్పారు.

తమ ప్రభుత్వం ఇలాంటి పాఠశాలలకు అవసరమైన అదనపు భవనాలను నిర్మించడం ద్వారా విద్యార్థుల ఇబ్బందులను తీరుస్తోందని పుష్ప శ్రీవాణి వివరించారు. గిరిజనశాఖకు చెందిన విద్యార్థులకు ఎలాంటి కష్టం కలిగినా 18005991133 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలపాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే పుష్ప శ్రీవాణి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేయడంతో పాటుగా పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.  మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శ శ్రీకాంత్ ప్రభాకర్, డీటీడబ్ల్యుఓ రుక్మాంగదరావు తదితరులు పాల్గొన్నారు.