టిటిడి అగర బత్తులు రెడీ... సెప్టెంబరులో భక్తులకు సరఫరా
టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే పరిమళభరితమైన అగర బత్తులు సెప్టెంబర్ మొదటి వారంలో భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలోని తన చాంబర్లో సోమవారం గో సంరక్షణ శాల, ఆయుర్వేద కళాశాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బెంగుళూరుకు చెందిన దర్శన్ సంస్థ సహకారంతో ఈ అగర బత్తులను తయారు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈవో కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి భక్తులకు ఆకర్షణీయమైన డిజైన్లతో రూపొందించిన ఏడు రకాల బ్రాండ్లతో తయారు చేసిన అగర బత్తులు సెప్టెంబర్ మొదటి వారంలో విక్రయించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో లడ్డూ కౌంటర్ల వద్ద, కొబ్బరికాయల కౌంటర్ వద్ద, గోశాల వద్ద, అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, విష్ణునివాసం, శ్రీనివాసంలలో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
అనంతరం ఈవో పంచగవ్య ఉత్పత్తులపై సమీక్షించారు. కొయంబత్తురుకు చెందిన ఆశీర్వాద్ సంస్థ సహకారంతో ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తులకు సంబంధించి ఈ నెలలోనే విధివిదానాలు రూపొందించాలన్నారు. ఇందుకోసం డిపిడబ్ల్యు స్టోర్స్‌లో అవసరమైన సివిల్, ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచగవ్య ఉత్పత్తులకు సంబంధించి లైసెన్స్, ప్యాకింగ్, మార్కెటింగ్ తదితర అంశాలపై సమీక్షించారు.
పంచగవ్య ఉత్పత్తులైన దివ్య మంగళ - ధూప్‌చూర్ణం, అగరబత్తీలు, సాంబ్రాణి కప్‌లు, ధూప్ స్టిక్స్, ధూప్ కోన్‌లు, ఐశ్వర్య - విబూది, పరిమళ - హెర్భల్ టూత్ పౌడర్, ఫేస్‌ప్యాక్, సోప్, షాంపూలు, సంజీవని - నాశల్ డ్రాప్స్, గో తీర్థ్ - గో ఆర్క్, పావని - హెర్బల్ ఫ్లోర్ క్లీనర్, గోపాల - ఆవు పేడ కేక్, ఆవు పేడ దుంగలు తదితర వాటిని సిద్ధం చేయాలన్నారు.
ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీ డైరీఫామ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ సమావేశంలో పాల్గొన్నారు.