శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (15:24 IST)

తెదేపా దుకాణం మూసేస్తామంటున్న బుద్ధా వెంకన్న!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ప్రజాక్షేత్రానికి వెళ్లి ఎన్నికల్లో తలపడాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోతే తమ పార్టీని మూసేస్తామని ప్రకటించారు. 
 
చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడుని తిరుపతి పోలీసులు రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకున్న విషయం తెల్సిందే. ఇది సీఎం జగన్ పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబే తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడన్న భయం జగన్‌లో మొదలైందన్నారు. జగన్‌కు నిజంగా ప్రజాబలముంటే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. 
 
అసలు ఆ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరిస్తే, టీడీపీని మూసేస్తామని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. ప్రజాబలంతో టీడీపీ విజయం సాధిస్తే, వైసీపీ దుకాణం కట్టేయడానికి జగన్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు. దుష్టశక్తులపై పోరాడే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేయరనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.