శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (15:59 IST)

విద్య మిథ్యేనా.. విద్యా సంస్థల అమ్మకానికి సీఎం జగన్ కుట్ర : ఆలపాటి

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి గత ప్రభుత్వాలు ఎంతో కృషితో పటిష్టమైన విద్యా వ్యవస్థగా నిలబెడితే సీఎం జగన్ రెడ్డి కేవలం 21 నెలల కాలంలో ఆ విద్యా వ్యవస్థను అథ:పాతాళానికి తొక్కేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ, గోరంత సంక్షేమం ఇచ్చి కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. మంగళవారం వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇపుడు ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల భూములు అమ్మేందుకు కుట్రలు చేస్తున్నారు. నేడు జగన్ తుగ్లక్ చర్యలతో ఎయిడెడ్ విద్యాసంస్థల వ్యవస్థ కనుమరుగు కానుంది. ఎయిడెడ్‌లో ఉన్న వాటిని ప్రైవేటుగా నిర్వహణ విధానంపై రూపకల్పన చేయడం విద్యా వ్యవస్థను బ్రష్టుపట్టించడమే అవుతుందన్నారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా 2,501 ఎయిడెడ్ విద్యా వ్యవస్థల్లో 3,40,468 మంది విద్యార్ధులు అభ్యసిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ వేతనాలతో దాదాపు 9,306 మంది బోధన సిబ్బంది ఉన్నారు. నేడు ప్రభుత్వం తీసుకుంటున్న అర్ధరహిత చర్యలకు అధ్యాపకులు బలి కావాల్సిందేనా? ఇప్పటికే గత ప్రభుత్వం విద్యార్ధుల కోసం అందిస్తున్న అనేక పథకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది. విదేశీ విద్యా నిధి వంటి బృహత్కక పథకాల నిలిపివేతతో విదేశాల్లో విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. 
 
ప్రభుత్వం వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు? విద్యార్ధుల భవిష్యతం ప్రభుత్వ బాధ్యత కాదా? 
విద్యార్ధులకు లక్ష నుంచి లక్షన్నర వరకు సాయం అందిస్తామని మ్యానిఫెస్టోలో హామీనిచ్చి మోసం చేశారు. ఫీజ్ రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్‌‌లు ఎత్తేశారు. పీజీ విద్యార్ధులకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను నిలపివేశారు. 
 
విద్యార్ధులకు మేలు చేసే పథకాలను నిలుపుదల చేసి సంక్షేమం అందించామని జగన్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం హేయం. విద్యావ్యవస్థ బలోపేతానికి కనీసం ఒక్క చర్యను కూడా జగన్ రెడ్డి తీసుకున్న పాపాన పోలేదు. జగన్ చర్యలతో నేడు పేద విద్యార్ధులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది.