ఆ విషయంలో జగన్ మోహన్ రెడ్డి, జయలలితను ఫాలో అవుతున్నారా...?
తమిళనాడులో కరుణానిధి, జయలలితలు ముఖ్యమంత్రులుగా పని చేసిన సమయంలో జరిగిన పరిణామాలు చాలామందికి తెలుసు. వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే చందంగా తయారయ్యేది. జయలలిత ప్రతిపక్షంలో ఉండి కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె కట్టించిన కొత్త భవనాలు, పథకాలను పూర్తిగా మార్చేసి వాటి స్థానంలో వేరే వాటిని ఏర్పాటు చేసేవారు కరుణానిధి.
కరుణానిధి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి అదే. తమిళనాడు ఒకటేమిటి అసెంబ్లీ కోసం అతి పెద్ద భవనాన్ని కడితే ఆ భవనాన్ని ప్రభుత్వ ఆసుపత్రిగా చేసేశారు. ఇలా ఒకరంటే మరొకరికి అస్సలు పడదు. కరుణానిధి కన్నా జయలలితే ఎక్కువగా ఆయనపై రివెంజ్ తీర్చుకున్నదన్న విమర్సలు లేకపోలేదు.
ప్రస్తుతం జయలలిత చేసినట్లుగానే ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారంటూ వాదనలు మొదలయ్యాయి. ఎందుకంటే చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం జరిగే సమయంలో ప్రజావేదికను నిర్మించారు. ప్రజావేదికలోనే ఎక్కువసేపు చంద్రబాబు గడిపేవారు. అయితే ఇది ఏమాత్రం జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం ఉండేది కాదనే వాదన వుంది. అలాగే అన్న క్యాంటీన్.. చంద్రన్న కానుకలు వంటి పథకాలు కూడా.
ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండటంతో నిన్నటికి నిన్న చంద్రబాబు నిర్మించుకున్న ప్రజావేదికలోని సామాన్లను నిర్థాక్షిణ్యంగా బయటపడేశారు. అంతటితో ఆగలేదు. ఈ రోజు ఏకంగా ప్రజావేదికను కూల్చేస్తామంటున్నారు. ఇదంతా చూస్తుంటే కరుణానిధిపై జయలలిత ఏ విధంగా అయితే ప్రతీకారం తీర్చుకున్నదో ప్రస్తుతం చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారా అనే వాదనలు వస్తున్నాయి. ఐతే సీఎం జగన్ మోహన్ రెడ్డి చెపుతున్న వాదనతో ఏకీభవించక తప్పడంలేదు మరి. అక్రమ కట్టడం అయితే కూల్చాల్సిందేగా మరీ...