త్వరలో జేసీ ట్రావెల్స్ రిజిస్ట్రేషన్ల రద్దు?!
ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, నాగాలాండ్ రాష్ట్రాల్లో జేసీ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. అశోక్ లేలాండ్ వద్ద స్కాప్ లారీలను కొనుగోలు చేసిన జేసీ వాటిని బస్సులుగా మార్చినట్లు ఆయన తెలిపారు.
నాలుగు రాష్ట్రాల్లో స్కాప్ లారీలను బస్సులుగా రిజిస్టర్ చేయించారని, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ పేరుతో 43 వాహనాలు, జఠాథర కంపెనీ పేరుతో 26 వాహనాలు కొన్నట్లు రికార్డులు సృష్టించారని వెల్లడించారు.
ఆరు వాహనాలను తనిఖీలు చేసినప్పుడు అక్రమాలు వెలుగు చూశాయని ప్రసాద్‌రావు తెలిపారు. రవాణాశాఖ ప్రత్యేక బృందం నాగాలాండ్‌లో కూడా దర్యాప్తు జరుపుతుందని, నాగాలాండ్‌లో కొన్నట్లు చూపిన బస్సులో కూడా బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
పోలీస్ శాఖ ఇచ్చే నో క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా బోగస్‌వే పెట్టారని తెలిపారు. ఇప్పటి వరకు 66 స్కాప్ లారీలను బస్సులుగా మార్చినట్లు గుర్తించారని, మరో 88 వాహనాలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
సుప్రీంకోర్టు చట్టాల ప్రకారం ఈ బస్సులకు అనుమతి లేదని, జేసీ ట్రావెల్స్‌లోని బస్సుల రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా సమాచారం ఇచ్చామని, అక్కడ కూడా రిజిస్ట్రేషన్లు రద్దు అవుతాయన్నారు.
తమ శాఖలో ఎవరి పాత్ర అయినా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేసీ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేశామని, బోగస్ సర్టిఫికెట్లు పెట్టినందుకు పోలీస్ శాఖ కూడా కేసు నమోదు చేసిందని తెలిపారు.
కేవలం జేసీ ట్రావెల్స్‌పైనే తనిఖీలు చేయలేదని, గత ఏడాది కాలంలో 14వేల కేసులు నమోదు చేశామని వెల్లడించారు. రూ.4కోట్లకుపైగా ఫైన్ వసూలు చేశామని ప్రసాద్‌రావు తెలిపారు.