ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (19:36 IST)

కొత్త కారు కొని ఇంటికి తీసుకెళ్తుండగా జనంపైకి దూసుకెళ్లింది..

ఓ వ్యక్తి ఇష్టపడి కొత్త కారును కొనుగోలు చేశాడు. ఆ కారును షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళుతున్నాడు. అయితే, ఆయన్ను దురదృష్టం వెంటాడింది. కారు టైరు పేలి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం కాగా ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లీలామహల్‌ సర్కిల్‌లో జరిగింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తిరుపతి అక్కారంపల్లికి చెందిన లక్ష్మీనరసింహ అనే వ్యక్తి కొత్త కారును కొనుగోలు చేశాడు. కారును షోరూం నుంచి లీలామహల్‌ వైపున్న తన నివాసానికి వెళ్తున్న క్రమంలో స్థానిక ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ వద్ద కారు టైరు పేలిపోయింది. 
 
దాంతో కారు అదుపుతప్పి రోడ్డు వెంబడి వెళుతున్న పాదాచారాలు, వాహనాలపైకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. పార్కింగ్‌ చేసిన బైకులపై దూసుకెళ్లడంతో 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి.
 
ఘటన అనంతరం కారు యజమాని తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.