గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (13:08 IST)

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ కోర్టు చివరి అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు చివరి అవకాశం ఇస్తూ, బెయిల్ రద్దు కేసు విచారణను జూన్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. 
 
జగన్ బెయిల్ రద్దు చేయలంటూ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. లాక్‌డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు తెలుపగా... సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. 
 
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది... .ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని... జూన్ ఒకటో తేదీన కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీంతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.