శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : గురువారం, 18 మే 2017 (15:18 IST)

సిమెంట్ బస్తా రూ.310లకే విక్రయించాలి : మంత్రి మండలి ఉప సంఘం ఆదేశం

రాష్ట్రంలో సిమెంట్ బస్తా తప్పనిసరిగా రూ.310లకే విక్రయించాలని మంత్రి మండలి ఉప సంఘం ఉత్పత్తిదారులను అదేశించింది. సచివాలయం 2వ బ్లాకులో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రి మండలి ఉ

రాష్ట్రంలో సిమెంట్ బస్తా తప్పనిసరిగా రూ.310లకే విక్రయించాలని మంత్రి మండలి ఉప సంఘం ఉత్పత్తిదారులను అదేశించింది. సచివాలయం 2వ బ్లాకులో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రి మండలి ఉప సంఘం సభ్యులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడులు మూడు అంశాలపై సమావేశమయ్యారు. వారు ఆయా శాఖ మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, అమర్నాథ్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఉన్నతాధికారులు, ఆయా రంగాలకు చెందినవారితో చర్చించారు. తొలుత ఫెర్రో ఎల్లాయిస్ రంగంపైన, ఆ తర్వాత నిరుద్యోగ భృతి, సిమెంట్ ధరల అంశాలపై చర్చించారు. 
 
అనంతరం మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడులు సమావేశాల వివరాలను మీడియాకు వివరించారు. సామాన్య ప్రజలు ఇబ్బందిపడకుండా సిమెంట్ బస్తా ధర రూ.310లకు విక్రయించాలని ఉప సంఘం అదేశించిందని, అందుకు ఉత్పత్తిదారులు అంగీకరించినట్లు చెప్పారు. రేపటి నుంచే ఈ ధర అమలు చేస్తారన్నారు. గత నెలలో ఉత్పత్తిదారులతో జరిగిన సమావేశం తరువాత ధరలు కొంత తగ్గినట్లు చెప్పారు. 
 
వారం, పది రోజుల తరువాత మళ్లీ సమీక్షిస్తామన్నారు. ఒక వేళ వాళ్లు చెప్పిన ధరకంటే ఎక్కువ అమ్మితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రభుత్వ సహాయాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. మైనింగ్, విద్యుత్ సరఫరా, ప్రభుత్వ చెల్లింపులు వంటివాటిని ఆపివేస్తామన్నారు. పరిశ్రమలవారిని ఇబ్బందిపెట్టే ఉద్దేశం తమకులేదని వారి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. కాంట్రాక్టర్లతో సంబంధంలేకుండా ప్రభుత్వమే చెల్లింపు ప్రభుత్వ పనులకు సరఫరా చేసే సిమెంటుకు సంబంధించిన డీడీలను కాంట్రాక్టర్లతో సంబంధంలేకుండా ప్రభుత్వమే చెల్లించేవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు చెప్పారు. 
 
హౌసింగ్, ఆర్అండ్ బి, పోలవరం ప్రాజెక్టు, పంచాయతీరాజ్ శాఖల పనులకు ఎక్కువగా సిమెంట్ అవసరం ఉంటుందని తెలిపారు. సమయానికి సిమెంట్ సరఫరా చేయకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోతున్నట్లు చెప్పారు. అందువల్ల ఏ శాఖకు ఎంత సిమెంట్ కావాలో వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఆ వివరాలను కంపెనీలకు పంపి సరఫరాలో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 
 
ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమలకు మరో ఏడాది రాయితీ ఇవ్వడానికి సిఫారసు రాష్ట్రంలోని ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమకు ప్రస్తుతం ఇచ్చే విద్యుత్ రాయితీని మరో ఏడాది పొడిగించడానికి ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో 35 ఫెర్రోఎల్లాయిస్ కంపెనీలు ఉన్నాయని, పవర్ టారిఫ్ పెరగడం వల్ల అప్పట్లో 30 కంపెనీలు మూతపడ్డాయని చెప్పారు. 
 
ఆ పరిస్థితుల్లో ఏడాది క్రితం విద్యుత్ ఛార్జీలను రూపాయిన్నర తగ్గించి రెండు ఏళ్లు ఇవ్వాలని ఆలోచన చేసి, ఒక ఏడాదికి అనుమతి ఇచ్చినట్లు వివరించారు. ఏప్రిల్‌తో సంవత్సరం అయిపోయిందని, 2వ సంవత్సరం కూడా రాయితీ పొడిగించమని ఆ పరిశ్రమ వర్గాలు అడిగినట్లు తెలిపారు. గత ఏడాది రాయితీ ఇవ్వడం వల్ల 25 కంపెనీలు తెరిచారని చెప్పారు. పది వేల మందికి ఉపాధిక కల్పించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయని, అయితే 6,800 మందికి ఉపాధి కల్పించినట్లు పరిశ్రమల శాఖ వారు తెలిపారని వివరించారు. 
 
ఈ నేపథ్యంలో పీఆర్సీ ఛైర్మన్ కూడా వారికి ఒక ఏడాది రాయితీ ఇవ్వమని సిఫారసు చేశారని చెప్పారు. దాంతో ఫెర్రోఎల్లాయిస్ కంపెనీల వారితో మాట్లాడి తాము కూడా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పామని, అంతేకాకుండా ఇదే చివరి అవకాశమని వారికి తెలిపినట్లు మంత్రులు చెప్పారు. అయితే వారికి రాయితీ మరో ఏడాది ఇవ్వమని మంత్రి మండలికి సిఫారసు చేయాలని మాత్రమే తాము నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి మండలి నిర్ణయం తరువాత వారికి రాయితీ కొనసాగిస్తారని మంత్రులు కామినేని, అచ్చెన్నాయుడులు చెప్పారు. నిరుద్యోగ భృతిపై జూలైలో తుది నిర్ణయం నిరుద్యోగులకు భృతి ఇచ్చే అంశంపై మంత్రి మండలి ఉపసంఘం చర్చించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. 
 
రాష్ట్రలో 12 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. అయితే ఆ సంఖ్యను స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎన్నికల హామీ ప్రకారం యువతకు న్యాయం చేస్తామని చెప్పారు. వారికి వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఏ విధంగా ఇస్తున్నారో తెలుసుకొని, మన రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. నిధులకు కొరతలేదని వారు చెప్పుకొచ్చారు.