1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2019 (13:08 IST)

పడకేసిన పోలవరంను సందర్శించనున్న నిపుణుల కమిటీ

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయాయి. అయితే, ఆదివారం కేంద్ర నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టును సందర్శించనుంది. పోలవరం ప్రాజెక్టు పురోగతిని స్వయంగా పరిశీలించనుంది. 
 
గడిచిన కొద్ది మాసాలుగా గోదావరి వరదలు కారణంగా పనులు మందగించడం, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు సిద్ధపడిన అనంతరం తాజా పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలించబోతుంది. ఇప్పటికే పలుమార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పటికీ తాజా రాక ఆసక్తిగా మారింది. పరిస్థితిని భేరీజు వేయడంతోపాటు ఇంతకుముందు తాము సూచించిన విధంగా పనులు కొనసాగుతున్నదీ లేనిదీ కమిటీ పర్యవేక్షించనుంది. 
 
నిపుణుల కమిటీ చైర్మన్‌ ఎస్‌కే హల్దార్‌, ఆర్‌కే పచౌరి, ఎస్‌ఎల్‌ గుప్తా, డి.రంగారెడ్డి, బీపీ పాండేతో సహా ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ సాంకేతిక నిపుణులు డీపీ భార్గవ పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారిలో ఉన్నారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పనులను, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను కూడా కమిటీ పరిశీలించనుంది.