శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2020 (18:53 IST)

'చలో పోలవరం యాత్ర' ఉద్రిక్తం.. సీపీఐ నేతల అరెస్టు

సిపిఐ పిలుపునిచ్చిన చలో పోలవరం యాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో బస చేసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అక్కడే నిర్బంధించారు.

హోటల్‌ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. నేతల నిర్బంధాలను నిరససిస్తూ హోటల్‌ ఎదుట ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది నేతలను గృహ నిర్బంధం చేశారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సిపిఐ ఈ యాత్రకు పిలుపునిచ్చింది. నాయకుల అరెస్టులను ఆపార్టీ విమర్శిస్తోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టని, దీనిని ఎవరైనా పరిశీలించే హక్కు ఉందన్నారు.

ప్రాజెక్టును చూడనివ్వకుండా అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని పోలీసులు తొలుత అడ్డుకున్నారు. కాసేపటికి హోటల్లోకి వెళ్లేందుకు అనుమతించారు.

సిపిఐ నాయకులను పోలీసులు నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. గృహనిర్బరంధం చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అర్థరాత్రి పూట అక్రమ అరెస్టులకు పాల్పడుతూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
 
పోలవరం ప్రాజెక్టు ఏమైనా నిషిద్ధ ప్రాంతమా?: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన సిపిఐ నాయకుల అక్రమ నిర్బంధాలను, వివిధ జిల్లాలలో నేతల హౌస్‌ అరెస్ట్‌లను టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అణిచివేత వైఖరి గర్హనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రతిపక్షాల బాధ్యత అని, ప్రజాపక్షంగా పనిచేసే ప్రతిపక్షాలపై దాడి ప్రజలపై దాడి అని అన్నారు. వైసిపి అప్రజాస్వామిక పోకడలను ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు ఏమైనా నిషిద్ధ ప్రాంతమా?
పోలవరం వద్దకు పోకుండా అడ్డుకునే హక్కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా పోలవరం పనులపై నిర్లక్ష్యం, ముంపు బాధితుల పునరావాసాన్ని గాలికి వదిలేయడం, ఇప్పుడు తాజాగా ఎత్తు తగ్గింపుపై ప్రచారం నేపథ్యంలో పోలవరం సందర్శనకు వెళ్తున్న సిపిఐ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం వైసిపి దమనకాండకు పరాకాష్ట అని పేర్కొన్నారు.

టిడిపి పాలనలో, వైసిపి పాలనలో తేడాలను ప్రజలే గమనిస్తున్నారని, పోలవరం పనుల పరిశీలనకు టిడిపి ప్రభుత్వమే దగ్గరుండి ప్రజలను తీసుకెళ్లి చూపించిందని గుర్తు చేశారు. 72 శాతం పనులను టిడిపి ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేసిందని, వైసిపి వచ్చాక 18 నెలలుగా పోలవరంపై నిర్లక్ష్యం చేశారని అన్నారు.

వైసిపి చేతగానితనం, అవినీతి బైటపడుతుందనే ప్రతిపక్షాలపై ఈ విధమైన అణిచివేత దమనకాండకు పాల్పడుతోందన్నారు. అక్రమ నిర్బంధం నుంచి సిపిఐ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులను ఎత్తివేయాలని, పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చేవారిని అనుమతించాలని పేర్కొన్నారు.